ఉల్లి కొందామన్నా కన్నీళ్లే! | Sakshi
Sakshi News home page

ఉల్లి కొందామన్నా కన్నీళ్లే!

Published Sat, Feb 21 2015 2:56 AM

ఉల్లి కొందామన్నా కన్నీళ్లే!

సాక్షి, హైదరాబాద్: కరువొస్తే ఢిల్లీ పీఠాన్నీ వణికించగల ఉల్లిగడ్డ రోజురోజుకూ ఘాటెక్కుతోంది.. కోస్తేనే కాదు కొందామన్నా కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోంది.. రాష్ట్రంలో కొరత నెలకొనడంతో కొద్దిరోజు లుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి అవసరమైన  స్థాయిలో రాకపోతుండడమే దీనికి కారణమవుతోంది. రాష్ట్రానికి రోజుకు సరాసరి 40 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ అవసరం. కానీ కొద్దిరోజు లుగా రోజూ కేవలం 25 వేల క్వింటాళ్లకు మించి సరఫరా కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
 
 ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 10 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం కాగా ప్రస్తుతం 6 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా అవుతోందని అంటున్నారు. గతేడాది హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు రోజూ తొమ్మిది వేల క్వింటాళ్ల ఉల్లి సరఫరా కాగా తాజాగా శుక్రవారం  కేవలం ఆరు వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా కావడం పరిస్థితేమిటో స్పష్టం చేస్తోంది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 9వరకు ఉండగా... ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 21కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఉల్లిగడ్డ ధర కిలో రూ. 25 నుంచి రూ. 35 వరకు పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 మహారాష్ట్ర దెబ్బ..
 దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతుండగా... ఒక్క మహారాష్ట్రలోనే మూడు లక్షల హెక్టార్లలో సాగవుతుంది.  ఇక్కడి నేలలు ఉల్లిసాగుకు అనువైనవి కాదు. దీంతో  90 శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో ఉల్లి విత్తనం కొరత, దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఈసారి సాగు బాగా తగ్గిపోయి, ఉల్లిగడ్డ ఉత్పత్తి పడిపోయింది.  
 
 పట్టించుకుంటేనే..

 ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. లేకుంటే కొరతను అడ్డుకోవడం, ధరలను నియంత్రించడం చాలా కష్టమని వారు పేర్కొంటున్నారు. కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో... ఇప్పటికే కొందరు వ్యాపారులు ఉల్లిని నల్లబజారుకు తరలించినట్లు తెలి సింది. ఇక ఉల్లిగడ్డను తక్కువ ధరకే అందించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్లి కొరతపై మార్కెటింగ్ అధికారి లక్ష్మీబాయిని ‘సాక్షి’ స్పందన కోరగా శుక్రవారం ఉల్లి కొరతపైనా, ధరలపైనా చర్చించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement