రికార్డులు గల్లంతు! | Sakshi
Sakshi News home page

రికార్డులు గల్లంతు!

Published Sun, Feb 21 2016 1:24 AM

రికార్డులు గల్లంతు! - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా కేవలం 54.56 శాతం సేత్వార్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు లెక్క తేలింది. ప్రతి సర్వే నంబర్‌కు ఒక సేత్వార్ ఉంటుంది. భూమి పుట్టుపూర్వోత్తరాలు, వర్గీకరణ, క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ధారించేందుకు సేత్వార్లు కొలబద్ధగా నిలుస్తాయి. ఈ భూమికి సంబంధించి ఏ రకమైన వివాదం ఏర్పడినా ముందుగా పరిశీలించేది సేత్వార్‌నే. ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం 1954 -55 కాస్రా పహాణీని పరిగణనలోకి తీసుకుంటారు. రాజధానిని ఆనుకొని ఉన్న  జిల్లాలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికి తగ్గట్టుగానే రెవెన్యూ వివాదాలు రెట్టింపయ్యాయి.

విలువైన భూములపై కన్నేసిన అక్రమార్కులు రికార్డులను తారుమారు చేయడమో.. దురుద్దేశంతో వాటిలో రికార్డులను దిద్దడమో చేశారు. కొన్నింటిని ఏకంగా కనిపించకుండా హస్తలాఘవం ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, సర్వే అధికారులు కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ఈ రికార్డులు సర్వే ల్యాండ్ రికార్డ్స్, తహసీల్దార్ల కనుసన్నల్లో ఉంటాయి. ఈ క్రమంలో రికార్డులను భద్రపరచాల్సిన సిబ్బంది భూ మాఫియాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

సేత్వార్లను మాయం చేయడం ద్వారా రెవెన్యూ వివాదాలకు ఊపిరి పోశారు. జిల్లావ్యాప్తంగా 2,51,830  సర్వేనంబర్లు (సేత్వార్లు) ఉండగా... దీంట్లో ఇప్పటి వరకు 1,40,514 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు లెక్క తేలింది. బాలానగర్‌లో దాదాపు 60 శాతం సేత్వార్లు అదృశ్యమయ్యాయి. చాలావరకు దీంట్లో సిబ్బంది హస్తమే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం అభిప్రాయానికొచ్చింది.

శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లోని 1052 సర్వే నంబర్లలో పట్టాదారుల  పేర్లు లేకుండా పోయాయి. అలాగే భూ వర్గీకరణ కూడా లేదని తేలింది. ఉప్పల్ మండలం నాచారం గ్రామంలో 137 సేత్వార్ రికార్డులు ఉర్దూ, అరబిక్ లిపిలో ఉండడమే గాకుండా చదవలేని స్థితిలో శిథిలమైనట్లు గుర్తించారు. రామంతాపూర్ ఖల్సాకు సంబంధించిన రికార్డుల డేటా కూడా కనిపించకుండా పోయింది. ఉప్పల్ ఖల్సా 356 సేత్వార్లు అసంపూర్తిగా ఉన్నట్లు తాజా పరిశీలనలో వెల్లడైంది.

Advertisement
Advertisement