హా...స్పత్రి! | Sakshi
Sakshi News home page

హా...స్పత్రి!

Published Wed, Jul 8 2015 12:43 AM

హా...స్పత్రి!

- ప్రమాదపుటంచున ఉస్మానియా
- పెచ్చులూడుతున్న భవనం పైకప్పు
- ఇప్పటికే అనేక మందికి గాయాలు
- భయం భయంగా సిబ్బంది విధులు
- ప్రకటనలకే పరిమితమవుతున్న నిధులు
- పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, సిటీబ్యూరో:
ఎందరికో ప్రాణభిక్ష పెట్టిన చరిత్ర... ఎన్నో మొండి రోగాలను నయం చేసిన ఘనత దాని సొంతం. కానీ ఇప్పుడు దానికే వైద్యం కరువైంది. నిధులనే మందులేసి... మరి కొన్నాళ్లు సేవలందించేలా చూడాల్సిన సర్కారు... అనాథలా వదిలేసింది. ఫలితంగా ప్రాణాలు పోసే ఆస్పత్రే...ప్రాణాంతకంగా మారింది. అదే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి. 1925లో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆస్పత్రి భవనాల పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. తరచూ రోగులు, వైద్య సిబ్బంది గాయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఫైర్‌సేఫ్టీ... పీసీబీల అనుమతులు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టాన్నేచవిచూడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
బిక్కుబిక్కుమంటూ...
కొన్నాళ్ల క్రితం సూపరెంటెండెంట్ చాంబర్‌లో అప్పటి అదనపు సూపరెంటెండెంట్ డాక్టర్ డీవీఎస్ ప్రతాప్, డాక్టర్ రవీందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి శివరామిరెడ్డి వివిధ అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా పైకప్పు పెచ్చులూడి పడింది. డాక్టర్లుడీవీఎస్ ప్రతాప్, రవీందర్ గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు, ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు.

తాజాగా నాలుగు రోజుల క్రితం జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలి కిందపడింది. దీంతో వైద్యులంతా సూపరెంటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని సోమవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఇక ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం వేధిస్తోంది. ఏ వార్డులోకి తొంగి చూసినా ముక్కు పుటాలదిరే దుర్వాసన. కళ్ల ముందే సర్జికల్ డిస్పోజల్స్, చెత్త, మురుగు నీరు పారుతున్నా పట్టించుకునే నాథుడు లేరు.
 
కాగితాలకే పరిమితం...
ఉస్మానియా ఆస్పత్రి ఏమాత్రం సురక్షితం కాదని ఇప్పటికే ఇంజినీరింగ్ నిపుణులు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. గాంధీ ఆస్పత్రి తరహాలో ఉస్మానియా ప్రాంగణంలో నాలుగెకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవ నాన్ని నిర్మించి... రోగుల ఇబ్బందులను తొలగించవచ్చని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దీని కోసం 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మర ణానంతరం అధికారంలోకి వ చ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.రూ.50 కోట్లు కేటాయించారు. ఆ మేరకు ఆస్పత్రిలో పైలాన్ ఏర్పాటు చేశారు.

కానీ ఇప్పటి వ రకు పునాది రాయి కూడా పడలేదు. ఇదే సమయంలో ఏడంతస్తుల భవ నానికి ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదంతస్తులకు కుదించారు. అడ్డంకులన్నీ తొలగాయని భావించి... పనులు మొదలు పెట్టే సమయంలో నర్సింగ్ విద్యార్థులు తమ భవనాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. దీంతో చంచల్‌గూడ జైలు సమీపంలో భవనాలు నిర్మించాలనే ప్రతిపాదన తెచ్చారు. ఈ అంశం ఎటూ తేలకముందే సీఎం కేసీఆర్ ఇటీవల మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఉస్మానియా ప్రాంగణంలోనే 12 అంతస్తులతో రెండు భారీ టవర్స్ నిర్మిస్తామని చెప్పారు. ఆరు నెలలవుతున్నా దీనికీ కదలిక లేదు.

అరచేతిలో వైకుంఠం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించింది. వైద్య పరికరాల కొనుగోలుకు 75 శాతం, భవనం పునరుద్ధరణకు 25 శాతం నిధులు ఖర్చు చే యనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కనీసం టెండర్లు కూడా పిలువలేదు. తాజాగా 2015 బడ్జెట్‌లో మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఇవన్నీ కాగితాలకే తప్ప...కార్యరూపం దాల్చలేదు.
డాక్టర్ నాగేందర్,
టీజీడీఏ అధ్యక్షుడు, ఉస్మానియా శాఖ

Advertisement

తప్పక చదవండి

Advertisement