మళ్లీ కూలింది.. | Sakshi
Sakshi News home page

మళ్లీ కూలింది..

Published Fri, Aug 24 2018 12:37 AM

Osmania Hospital in Dilapidation - Sakshi

చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు అనంతయ్య(60). షాద్‌నగర్‌ తొండపల్లికి చెందిన ఈయనకు 20 రోజుల క్రితం బైక్‌ ఢీకొట్టింది. కాలుకు ఫ్రాక్చర్‌ కావడంతో సర్జరీ కోసం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి పాత భవనం లోని ఆర్థోపెడిక్‌ వార్డులో ఇటీవల ఇన్‌పేషంట్‌గా చేరాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి ఆయనపై పడింది. ఆయన్ను వెంటనే ఐసీయూకు తరలించారు. అదేవార్డులోని రోగులంతా భయంతో బయటికి పరుగులు తీయాల్సి వచ్చింది. నెలలోనే 3సార్లు పెచ్చులూడి పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది రోగుల ఆరోగ్యప్రదాయిని అయిన ఉస్మానియా ఆస్పత్రి నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్‌ వార్డులో పైకప్పు గురువారం ఉదయం మళ్లీ పెచ్చులూడి పడింది.  అసలే వర్షాకాలం.. ఆపై పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపు తున్నారు. భవనం నిర్మించి సుమారు వందేళ్లు కావొస్తుం డటం, ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది.

ఈ నెల 19న 12 ఫీట్ల ఎత్తున్న దోబీఘాట్‌ గోడ కూలగా..  అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నెల 13న ఓపీ భవన ప్రధాన ద్వారం ఫోర్టికో పైకప్పు కూలింది. భారీ శబ్దం రావడంతో ఓపీలోని రోగులు భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. నెల క్రితం పాత భవనం రెండో అంతస్తులో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఇప్పటికే ఈ విభాగాన్ని ఖాళీ చేయడంతో పెద్ద ప్రమాదం త ప్పింది.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
ఇప్పటికే పాత భవనం రెండో అంతస్తును ఖాళీ చేయించాం. అందులోని 240 పడకల ను ఫస్ట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సర్దుబాటు చేశాం. పాత భవనం దుస్థితిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వర్షానికి స్లాబ్‌లు, గోడల నాని బలహీనంగా తయారయ్యాయి. - డాక్టర్‌ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి

Advertisement
Advertisement