ఓయూ ఉత్సవాల్లో వినూత్న కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

ఓయూ ఉత్సవాల్లో వినూత్న కార్యక్రమాలు

Published Fri, Apr 7 2017 12:49 AM

ఓయూ ఉత్సవాల్లో వినూత్న కార్యక్రమాలు - Sakshi

26న శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ
రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో ప్రత్యేక సమావేశాలు


సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఓయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యాం మోహన్, రాజమహేందర్‌రెడ్డి తెలిపా రు. ఈనెల 26న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్‌ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొంటారని వివరించారు.

 పూర్వ విద్యార్థుల సంఘం చేపట్టే కార్యక్రమాలను గురువారం వారు మీడియాకు వివరించారు. ఏప్రిల్‌ 27న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30  వరకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉంటాయన్నారు.రెండో రోజున  పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పాల్గొంటారని చెప్పారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థానా ల్లో ఉన్న వంద మంది పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు వారు చెప్పారు.

ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓయూ పూర్వ విద్యార్థులకు ఆహ్వానాలు అందిస్తున్నామని, ఈమేరకు వారి ఫోన్‌ నంబర్లను సేకరిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశామని, ఉస్మానియావర్సిటీతో పాటు అనుబంద కాలేజీల్లో చదివిన వారంతా అందులో పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. అలాగే వివరాల నమోదుకు  టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేశామని, 70971 51115 మొబైల్‌ నంబర్‌కు సంప్రదించాలర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల కు సంఘం తరఫున రూ.25లక్షలు వర్సిటీకి ఇచ్చినట్లు వివరించారు.

వంద గ్రామాలను దత్తత తీసుకుంటాం..
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాలను దత్తత తీసుకుని ఉస్మానియా మోడల్‌ విలేజ్‌లుగా చేసేందుకు తీర్మానించామని వారు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై ఈనెల 9న ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల పూర్వ విద్యార్థి సంఘాలతో గాంధీ మెడికల్‌ కాలేజీ కాన్ఫరెన్స్‌ హాలులో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈనెల 15న ఓయూ వీసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement