మా బాధ్యత మరింత పెరిగింది | Sakshi
Sakshi News home page

మా బాధ్యత మరింత పెరిగింది

Published Thu, May 14 2015 4:47 AM

Our responsibilities high after govt declares 43% of Fitment

సీఎంతో చర్చల అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులందరికీ 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని.. దీనిపై సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. దీనితో తమ బాధ్యత మరింత పెరిగిందని... రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని వారు చెప్పారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. సమ్మె కాలంలో ప్రయాణికులకు జరిగిన ఇబ్బందిపై క్షమాపణలు కోరారు. వెంటనే సమ్మె ఉపసంహరించుకుంటున్నామని.. డ్రైవర్లు, కండక్టర్లందరూ ఉన్నఫళంగా విధుల్లో చేరాలని సూచించామని చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబరాలు జరుపుకొన్నారు.
 
 అనంతరం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) అధ్యక్షులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 44 శాతం ఫిట్‌మెంట్, బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయాలన్నీ తెలంగాణ ఉద్యమంలో తమ శ్రమకు ప్రతిఫలమని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద గురువారం సంబరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పదవీవిరమణ పొందిన కార్మికులకు కూడా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం, సమ్మెకాలాన్ని విధుల్లో ఉన్నట్లు గుర్తించడం వంటివి కేసీఆర్ ఉదార స్వభావానికి నిదర్శనమని ప్రశంసించారు. సీఎం తమ పట్ల చూపిన ఆదరణకు రుణం తీర్చుకుంటామని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిన ఆర్టీసీ కార్మికుల గౌరవాధ్యక్షుడు, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
 

Advertisement
Advertisement