పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి

Published Mon, Aug 25 2014 4:39 AM

Padiparisrama development effort

  • {పతీ రైతు ఓ గేదెను పెంచుకోవాలి
  •      డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య
  •      రెండేళ్లలో నియోజకవర్గంలోని రిజర్వాయర్లు పూర్తి : ఎంపీ కడియం
  • స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్:  పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘం, స్టేషన్‌ఘన్‌పూర్ పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మండలకేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న స్థలంలో పాడిపంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం హాజరయ్యారు.

    కార్యక్రమంలో మొదట స్థానిక పాలశీతలీకరణ కేంద్రంలో విజయపాలు, పాల పదార్థాల విక్రయ కేంద్రాన్ని ఆయనతోపాటు ఎంపీ కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో రాజయ్య మాట్లాడారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 3,95,634 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా 60శాతం మాత్రమే స్థానికంగా వినియోగిస్తున్నారన్నారు.

    మిగిలిన 40 శాతం మార్కెట్‌కు, పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు రైతులు కృషి చేయాలన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం, పౌల్ట్రీఫాంలపై ఆసక్తి చూపాలని, ప్రతీ రైతు ఒక గేదెను పెంచాలని సూచించారు. స్థానిక పాలశీతలీకరణ కేంద్రాన్ని ఐదువేల లీటర్ల సామర్థ్యంతో తిరిగి నిర్మించేందుకు  కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ భూమి కేటాయించేందుకు కృషిచేస్తానన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి రావడం ఆలస్యమైందని, రైతుల క్షమించాలని కోరారు.
     
    రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం : కడియం

     
    రైతు సంక్షే మమే ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. రైతు రుణమాఫీకి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. నియోజక వర్గంలోని కొన్ని రిజర్వాయర్ల పనులు, కాల్వల పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి రెండేళ్లలో కాల్వల నిర్మాణం పూర్తి చేసి లక్షా నలభైవేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
     
    అనంతరం పాల ఉత్పత్తిదారుల సంఘం, పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీ శ్రీహరిలను శాలువా, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలతో సన్మానించారు. సమావేశంలో ఎంపీ కడియం మాట్లాడుతూ ఉండగానే డిప్యూటీ సీఎం తనకు వేరే పని ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం రాజయ్య పశుప్రదర్శనలో ఉంచిన గేదెలు, ఆవులు, లేగదూడలను పరిశీలించారు.

    సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ శంకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రామారావు, టీఆర్‌ఎస్‌మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్.నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ భూక్య స్వామినాయక్, ఎంపీపీ వంగాల జగన్‌మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గట్టు రమేష్, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ జైహింద్‌రాజ్, గోనెల ఉపేందర్, శివునిపల్లి సర్పంచ్ సమ్మక్క, టీఆర్‌ఎస్ నాయకులు సింగపురం జగన్, చట్ల కుమార్‌గౌడ్, తోట సత్యం, పెసరు సారయ్య, పార్శి కమల్‌కుమార్‌తో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement