ఆర్టీసీ... హైటెక్‌!  | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ... హైటెక్‌! 

Published Thu, Jan 3 2019 2:59 AM

Panic button is mandatory in the GPS and in buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధునికత దిశగా ఆర్టీసీ ప్రయాణిస్తోంది. ప్రయాణికుల భద్రతకు సాంకేతికత తోడవుతోంది. రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు భరోసా ఇస్తోంది. ప్రజారవాణాలో ఉన్న ప్రతి వాహనానికి జీపీఎస్‌(జియో పొజిషనింగ్‌ సిస్టమ్‌) తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఈ ఆదేశాలు పాతవే అయినా.. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రవాణా సంస్థలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జీపీఎస్‌ పరికరంతోపాటు ప్యానిక్‌ బటన్‌లు కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రజారవాణా సంస్థల్లో టీఎస్‌ఆర్టీసీ అత్యంత కీలకమైనది. సంస్థ వద్ద దాదాపు 10,500 బస్సులున్నాయి. ఇందులో 2,200 అద్దె బస్సులు ఉన్నాయి. రోజూ 98 లక్షల మందికిపైగా వివిధ రూట్లలో ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. రోజూ రూ.12 కోట్ల కలెక్షన్‌ ఉంటుంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 6 నెలల నుంచి హైదరాబాద్‌– కరీంనగర్‌– మెట్‌పల్లి మార్గంలో పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. 400 బస్సులకు జీపీఎస్‌ పరికరాలను బిగించి పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ పైలట్‌ ప్రాజెక్టు మార్చి ఆఖరునాటికి లేదా ఏప్రిల్‌ మొదటివారానికి కొలిక్కి వచ్చే అవకాశముందని సమాచారం. 

త్వరలో ఆర్టీపీఎస్‌ రద్దు?
ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు ‘రియల్‌ టైమ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం’ (ఆర్టీపీఎస్‌) గ్రేటర్‌ పరిధిలో దాదాపు 600 బస్సుల్లో నిర్వహిస్తోంది. జీపీఎస్‌ అందుబాటులోకి వస్తే నగరంలోని ఆర్టీపీఎస్‌ను రద్దు చేసి దానిస్థానంలో జీపీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. నగరం ప్రైవేటు ట్రావెల్స్, ఓలా, ఉబర్‌ లాంటి వివిధ ప్రైవేటు క్యాబ్‌ సర్వీసులు కూడా జీపీఎస్, ప్యానిక్‌ బటన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తమ బస్సు ఎక్కడుందనే విషయాన్ని యాప్‌లో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రైవేటు రవాణా సంస్థల పోటీని తట్టుకోవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. 

లారీలు, కార్లు కూడా...: మోటారు వాహన నిబంధనలు–1989 పరిధిలోకి వచ్చే అన్ని వా హనాలు అంటే బస్సులు, లారీలు, కార్లు ఇలా రవాణాకు వినియోగించే ప్రతి వాహనం ఇకపై జీపీఎస్, ప్యానిక్‌ బటన్లు అమర్చుకోవాలి.

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు, యాప్‌ల రూపకల్పన! 
పైలట్‌ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తికాగానే అధికారులు జీపీఎస్‌ పరికరాల బిగింపు కోసం టెండర్లు ఆహ్వానిస్తారు. ఇకపై కొనుగోలు చేసే ప్రతి బస్సుకు చాసిస్‌తోపాటు జీపీఎస్, ప్యానిక్‌ బటన్‌లు కలిపి ఉండేలా చూసుకుంటారు. జీపీఎస్‌ కోసం ఎంజీబీఎస్‌లో ఒకటి(రాష్ట్రవ్యాప్త సర్వీసుల కోసం), జేబీఎస్‌లో (గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్సుల కోసం) మరో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేయనున్నారు. బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన యాప్‌ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. 

డివైజ్‌ లేకపోతే నో పర్మిట్‌! 
ఏఐఎస్‌–140 పేరిట వెహికిల్‌ ట్రాకింగ్‌ పోర్టల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధి చేసింది. ఇందులో ఏఐఎస్‌–140 ట్రాకింగ్‌ డివైజ్, వాహనం చాసిస్‌ వివరాలు నమోదవుతాయి. జీపీఎస్‌ పరికరం బిగించుకోకపోతే కొత్త వాహనాలకు అనుమతి, పాత వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను రవాణా శాఖ జారీ చేయదు. స్కూలు, ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, ఇతర రవాణా వాహనాలకు ఇకపై ఈ డివైజ్‌ బిగింపు తప్పనిసరి. భవిష్యత్తులో ఇవి లేని వాహనాలు రోడ్డుపైకి వెళ్లడానికి అనుమతి దొరకదు.   

Advertisement
Advertisement