పరిషత్ పోలింగ్ 77.14 % | Sakshi
Sakshi News home page

పరిషత్ పోలింగ్ 77.14 %

Published Mon, Apr 7 2014 2:25 AM

parishad polls 77.14%

ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు స్వల్వ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతగా 18 మండలాల్లోని 18 జడ్‌పీటీసీ, 289 ఎం పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 77.14 శాతం నమోదైంది. పోలింగ్ సరళి ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం వరకు నిదానంగా సాగింది.
 
మొదటి రెండు గంటలలో ఉదయం9 గంటలకు 14.19 శాతం, ఉదయం 11 గంటలకు 33.18 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.15 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 66.32 శాతంగా నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 18 మండలాలలో కలిపి 77.14 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని మండలాల్లో ఓటర్లు ఎండ తీవ్రతను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరగా, మరి కొన్ని చోట్ల అంతగా బయటకు రాలేకపోయారు.
 
 బిచ్కుంద, బోధన్, నిజాంసాగర్, రెంజల్, బీర్కూర్, ఎడపల్లి మండలాల్లో అత్యధికంగా 80 నుంచి 83 శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. బాన్సువాడ, డిచ్‌పల్లి, మండలాల్లో 71.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 7,28,809 మంది ఓటర్లలో  5,62,199 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
ఆకుల కొండూర్‌లో పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ
శనివారం అర్ధరాత్రి నిజామాబాద్ మండలం ఆకుల కొండూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బులు పంచుతున్నారనే సమాచారం మేరకు రూరల్ టౌన్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గుంపులుగా ఉన్న గ్రామస్తులను లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అతనిపైనా చేయి చేసుకున్నారు.
దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

అక్కడున్న పోలీసు వాహనానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పోలింగ్ బూత్‌లోని ఎన్నికల ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ తరుణ్ జోషి వివరాలు తెలుసుకున్నారు. కాగా గ్రామ సర్పంచ్‌తో పాటు, పలువురు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
పలు మండలాలలో స్వల్ప ఉద్రిక్తత
పోలింగ్ రోజు కొన్ని మండలాలలో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బాన్సువాడ మండలం తాడ్‌కోల్ గ్రామంలో ఓటర్లపై పోలీసులు చేయి చేసుకున్నందుకు గ్రామస్తులు ఆందోళన చేశారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లిలో ఓటర్లను ఆటోలో పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను అక్కడున్న పోలీసులు చితకబాదారు.

డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు లేనందుకు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.బీర్కూర్ మండలం కిష్టాపూర్‌లో ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ హోం గార్డు కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.
 
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ సరళిని పరిశీలించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న డిచ్‌పల్లి, బోర్గాం, మంచిప్ప, మోపాల్ తదితర గ్రామాలను సందర్శించారు. ఎన్నికల పరిశీలకులు భారతీ లక్‌పతి నాయక్ బాన్సువాడ, బిచ్కుంద, వర్ని తదితర మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి, బోధన్  సబ్ కలెక్టర్ హరినారాయణన్, ఆయా డివిజన్‌ల ఆర్డీఓలు, డీఎస్పీలు కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
 
ఓటేసిన ప్రముఖులు...
ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంపూర్‌లో ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకోగా, మద్నూర్‌లో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నవీపేట మండలం పోతంగల్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు వేశారు.

Advertisement
Advertisement