కేసీఆర్ అసలైన మొగోడు.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్ అసలైన మొగోడు..

Published Tue, Jun 7 2016 3:21 AM

కేసీఆర్ అసలైన మొగోడు.. - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన మొగోడు..
ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లడగనని సవాల్ విసిరిన నాయకుడు
►  కేంద్రంలో టీఆర్‌ఎస్ భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదు
రెండేళ్లలోనే దేశం యూవత్తు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంది
కోదండరామ్ తీరు బట్టకాల్చి మీదేసినట్టుంది..
ఏం కావాలో చెప్పాలే తప్ప ప్రభుత్వం తప్పుకోవాలంటే ఎట్లా?
సాక్షి ఇంటర్వ్యూలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు

 
మనది కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి కొంత సహకారం అవసరం. ఈ విషయంలో పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి సాధించడానికి కృషిచేస్తా’నని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. రెండేళ్లలోనే దేశం యూవత్తు తెలంగాణ వైపు చూసేలా ఎన్నో పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తుండటం గర్వంగా ఉందన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ శ్రేణుల్లో నిరాశ లేదని, మంత్రులు ప్రజల అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి పనిచేస్తున్నారని అన్నారు. ‘

కేసీఆర్ అసలు సిసలైన మొగోడు. ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడగబోనని ప్రజలకే సవాల్ విసిరిన నాయకుడు’ అని ప్రశంసించారు. ఐదున్నర దశాబ్దాల క్రితం ఆర్మీలో చేరి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని రక్షా మెడల్ సాధించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆ తరువాత సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.   - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 
 
సాక్షి : రాజ్యసభ సభ్యుడిగా ఎప్పుడు ప్రమాణం చేస్తున్నారు.. ఎంపీగా మీ ప్రాధాన్యతలేమిటి?

కెప్టెన్ : ఈనెల 21 తరువాత రాజ్యసభ చైర్మన్ సమక్షంలో ఎంపీగా ప్రమాణం చేస్తా. మనది కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి కొంత సహకారం అవసరం. ఉదాహరణకు హైకోర్టు విభజన జరగాలి. కానీ ఎందుకు విభజించడం లేదో తెల్వదు. అట్లాగే నిధులు కావాలి.ఈ విషయంలో పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి తెచ్చుకుంటాం.

సాక్షి : మీతోపాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన డీఎస్‌కూ ఎంపీ సీటిచ్చారు కదా! పార్టీ శ్రేణులు ఎట్లా అర్థం చేసుకోవాలి?

కెప్టెన్ : ‘పాతవాళ్లను విస్మరించబోం... కొత్తవాళ్లను కూడా తీసుకుని గౌరవించి వారికి తగ్గ బాధ్యత అప్పగిస్తాం’ అనే సంకేతాలను కేసీఆర్ పంపారు. ఇందుకు ఉదాహరణ  డీఎస్, నేను. ప్రజలకు ఏది అవసరం... ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ అవసరాలను ఎవరి ద్వారా ఏరకంగా తీర్చవచ్చనే విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తున్నారు.


సాక్షి : నామినేటెడ్ పదవుల  భర్తీలేక పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ అలుముకుంది కదా?

 కెప్టెన్ : మీడియాకు తప్ప పార్టీ కార్యకర్తలు, నాయకులెవ్వరికీ నిరాశ లేదు. రాష్ట్రం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. సంస్థల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. అవి పూర్తికాకుండా నామినేటెడ్ పదవులను ఎట్లా భర్తీ చేయాలి? అంతా గందరగోళ పరిస్థితి. ఇప్పుడున్న వాళ్లకే సీట్లు ఖాళీగా లేవు. కొత్తగా భర్తీ చేస్తే వాళ్లకు సీట్లేలా? కేవలం కుర్చీపై కూర్చోపెడితే సరిపోతుందా? పని, ఉద్యోగులుండాలి కదా! అవేం లేకపోతే వాళ్లకే ఇబ్బంది. బంగారు తెలంగాణ రావాలంటే పదవి ఇచ్చినోడల్లా పనిచేయాలి. పదవి ఇచ్చి ఖాళీగా కూర్చోబెడితే రాష్ట్రానికి ఏం లాభం? కేసీఆర్‌కు ఇవ్వన్నీ తెలుసు కాబట్టే... ముందు రాష్ట్రాన్ని చక్కదిద్ది ఆ తరువాత పదవుల భర్తీపై దృష్టి సారిస్తున్నారు.

సాక్షి : రెండేళ్ల పాలనలో మీకు బాగా నచ్చిన కార్యక్రమాలేవి?

కెప్టెన్ : యావత్ భారతదేశం మెచ్చుకున్న కార్యక్రమం మిషన్ కాకతీయ. ఒకనాడు తెలంణాలతో గొలుసుకట్టు చెరువులే ఆధారం. సమైక్య రాష్ట్రంలో వాటి నిర్వహణలేక కుంటుపడిపోయాయి. భూగర్భ జలాలను పెంచేందుకు, సాగునీరందించేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమం మిష న్ కాకతీయ. కేసీఆర్‌కు తప్ప ఎవరికీ ఊహకందని కార్యక్రమం. అట్లాగే ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడగను అన్న మగోడు కేసీఆర్. ఏ ముఖ్యమంత్రై నా ప్రజలకు ఇట్లాంటి సవాల్ విసిరిండా? ఆ మాట అ న్నారంటే కేసీఆర్‌కు ఎంత కమిట్‌మెంట్ ఉందో అర్ధమవుతుంది కదా!  ఉన్న వనరులను వాడుకుని ప్రజ లను సం తృప్తిగా ఉంచే ఆలోచనే వాళ్లకు లేకుండాపోయింది. ఆ పనిచేస్తున్న కేసీఆర్‌ను ప్రపంచమంతా పొగుడుతోంది.


సాక్షి : ప్రభుత్వం నుంచి ఆశించిన ఫలితాలు రాలేదంటూ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శిస్తున్నారు కదా!

కెప్టెన్ : బట్టకాల్చి మీదేస్తానంటే లాభం లేదు. బరువు మీద ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆలోచించి మాట్లాడితే జవాబివ్వొచ్చు. అసలు కావడి బరువు ఎంత ఉందో కూడా తెల్వకుంటే ఎట్లా? ప్రభుత్వంలో జరుగుతున్న పనుల సంగతేంది? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అసలు ఏం కావాలో చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మోసేటోడికే తెలుసు కావడి బరువు.

సాక్షి : వ్యవసాయంపై అధ్యయనం చేయడం లేదని, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కోదండరామ్ అన్నారు కదా!

కెప్టెన్ : రైతుల ఆత్మహత్యలు గత పాలకులు చేసిన పా పం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి సమర్థుడే. కానీ దిక్కుమాలిన వాహనాన్ని నడుపుతున్నాడు. గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఆలస్యమవుతోంది. మధ్యమధ్యలో రిపేర్లు చేసుకుంటూ వెళుతున్నాడు. అవన్నీ చెప్పకుండా సరిగా నడపడం లేదని మాట్లాడితే ఎట్లా? అసలు ఉద్య మం ఎందుకు చేసినం. గతంకంటే బాగా బతకాలనే కదా! ఇప్పుడు జరుగుతున్న వాటిలో తప్పులుంటే సరిచేసుకోవాలని మాట్లాడండి.మిషన్ కాకతీయ వద్దం టున్నావా? మిషన్ భగీరథ వద్దంటున్నావా? సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొద్దంటున్నావా? అసలేం వద్దు... ఏం కావాలో చెప్పాలే తప్ప ప్రభుత్వం తప్పుకోవాలంటే ఎట్లా? వ్యవసాయం చేసేటోడికే దాని గురించి తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం చేసేటోడే. ఆయనకు మనమేం చెబుతాం. ఇప్పుడు మాట్లాడేటోళ్లకు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసు?

సాక్షి : రాష్ర్టంలో కులవృత్తులు సంక్షోభంలో లేవంటారా?

కెప్టెన్ : కులవృత్తులకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఆధునీకరణ ఎక్కువైంది. ఈ సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి, ఫలానా వృత్తుల వారికి ఫలానా పనిచేస్తే బాగుంటుంది, వారి బతుకులు బాగుపడతాయని ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం ముందుపెడితే నిర్మాణాత్మకంగా ఉంటుందే తప్ప ఏదోరకంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఎట్లా? కేసీఆర్‌కు రాష్ర్టంపై పూర్తి అవగాహన ఉంది... ప్రజలకు ఏం కావాలో అవగాహన ఉంది కాబట్టే ఈ మాత్రం పని జరుగుతోంది.  

సాక్షి :మంత్రుల పనితీరు ఎట్లా ఉంది?

కెప్టెన్ : చాలా బాగుంది. వాళ్లకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటనేది గుర్తించి ఆ మేరకు పనిచేస్తున్నారు. గతంలో మంత్రులంటే సచివాలయంలోనే కూర్చునేవాళ్లు. కొందరు వెళ్లి పైరవీలు చేసుకునేవాళ్లు. కానీ నేడు అట్లా కాదు. మం త్రులంతా క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. ప్రజల బాగోగులను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తున్నా రు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు, వాటి ప్రా ధాన్యతలు గుర్తించి వాటి అమలుకు కృషి చేస్తున్నారు.

సాక్షి : కేంద్రంలో టీఆర్‌ఎస్ భాగస్వామి కావడంపై మీ అభిప్రాయమేమిటి? అట్లయితేనే రాష్ట్రానికి మరింత సహకారం అందుతుందంటారా?  

కెప్టెన్ : నా దృష్టిలో టీఆర్‌ఎస్ కేంద్రంలో భాగస్వామి కావాల్సిన అవసరం లేదు. భాగస్వామి కాకపోయినా రాష్ట్రానికి అవసరమైన వనరులు సాధించుకోవచ్చు. అయితే అవి సాధించుకునే క్రమంలో కేంద్రానికి మన అవసరం ఎంత ఉందనేది స్పష్టంగా తెలియజేయాలి. ఆ విషయాన్ని కేంద్రానికి చెప్పే దానినిబట్టే అనుకున్న వనరులను సాధించుకోగలుగుతాం.
 

Advertisement
Advertisement