కార్యదర్శుల్లేక అందని ‘ఆసరా’ | Sakshi
Sakshi News home page

కార్యదర్శుల్లేక అందని ‘ఆసరా’

Published Tue, Dec 29 2015 2:24 AM

కార్యదర్శుల్లేక అందని ‘ఆసరా’ - Sakshi

♦ పింఛన్లు అందక వృద్ధుల తిప్పలు
♦ వేలిముద్ర సరిపోలని వృద్ధులు, వికలాంగులకు పంపిణీ నిలిపేత!
♦ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతోనే పింఛన్లు ఇవ్వాలని సర్కారు మెలిక
 
 సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల కొరత ప్రభావం ‘ఆసరా’ పింఛన్లపైనా పడింది. బయోమెట్రిక్ పరికరంపై వేలిముద్రలు సరిపోలని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయాలంటే, పంచాయతీ కార్యదర్శుల వేలిముద్రలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల నిబంధన విధించింది. దీంతో కార్యదర్శులు లేని గ్రామాల్లో ఆసరా లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్కరూ నాలుగు నుంచి ఏడేసి గ్రామాలకు ఇన్‌చార్జి బాధ్యతలు నిర ్వర్తిస్తున్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో కార్యదర్శులు అందుబాటులో ఉండని కారణంగా వేలాదిమందికి ఆసరా పింఛన్లు అందకుండా పోతున్నాయి.

కార్యదర్శి రాకుండా పింఛన్లు ఇచ్చేది లేదని పోస్టల్ సిబ్బంది తెగేసి చెబుతుండటం, పంపిణీకి గడువు ముగుస్తున్నా కార్యదర్శి పత్తా లేకపోవడంతో లబ్ధిదారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే పలు బాధ్యతలు, గ్రామజ్యోతి పనులు, ఉన్నతాధికారుల సమీక్షలతో పనిభారం అధికమవుతున్న తమకు పింఛన్ల పంపిణీ మరో తలనొప్పిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పింఛన్లకు కార్యదర్శుల వేలిముద్రతో లింకు తీసేయాలని లబ్ధిదారులతోపాటు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

 బ్యాంకుల్లేని ప్రాంతాల్లో..
 ఆసరా పథకం అమల్లో అవకతవకలను నివారించేందుకు ప్రభుత ్వం పలు మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టింది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు.. ఇలా బ్యాంకుల లభ్యత ఉన్నచోట్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్మును జమచేస్తున్నారు. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాల్లో పోస్టాఫీసుల ద్వారా ఇస్తున్నారు. దీని కోసం అక్కడ బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అన్ని కేటగిరీల పింఛన్లన్నీ కలిపి మొత్తం 35,55,754 ఉండగా, ఇందులో వృద్ధాప్య పింఛన్లు 13,70,476, వికలాంగుల పింఛన్లు 4,37,343 ఉన్నాయి.

వివిధ కారణాల వల్ల పలుమార్లు వృద్ధులు, వికలాంగుల వేలిముద్రలు బయోమెట్రిక్ పరికరంలోని వేలిముద్రలతో సరిపోలడం లేదు. ఫలితంగా ప్రతి నెలా సుమారు 20 శాతం మందికి ఇక్కట్లు తప్పడం లేదు. మెదక్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక భాగం గ్రామాల్లోనూ, మిగిలిన జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ పోస్టాఫీసుల ద్వారానే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ప్రకారం ప్రతి నెలా 25వ తేదీలోపే పింఛన్లను పంపిణీ చేసే వీలుం టుంది. ఆలోగా పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు రాకుంటే, ఆ నెల పింఛన్‌ను వలసపోయిన వారి ఖాతా కింద జమచేస్తారు. ఆ నెల్లో పింఛను పొందాలంటే మళ్లీ వచ్చే నెల పంపిణీ వరకు ఆగాల్సిందే. ఇలా వరుసగా మూడు నెలలు అందకుంటే ఆ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు స్థానిక పోస్టల్ అధికారులకు అధికారం ఉండదు. ప్రధాన కార్యాలయానికి వెళ్లక తప్పదు.
 
 పైలట్ ప్రాతిపదికన ‘ఐరిస్’
 పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఐరిస్ (కంటిపాపల గుర్తింపు) విధానాన్ని అవలంబించాలని సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐరిష్ విధానంలో పింఛన్ల పంపిణీకి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. ఇది విజయవంతమవడంతో త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేయాలనుకుంటున్నట్లు అధికారులు  తెలిపారు. బయోమెట్రిక్ పరికరంపై వేలిముద్రలు సరిపోలనంత మాత్రాన లబ్ధిదారులు ఆం దోళన చెందనక్కర్లేదని, పంపిణీలో అవకతవకలు జరగకుండా చూసేందుకే పంచాయతీ కార్యదర్శి వేలిముద్రకు లింకు పెట్టినట్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement