కరోనాకు ముందు...తరువాత | Sakshi
Sakshi News home page

కరోనాకు ముందు...తరువాత

Published Tue, Apr 14 2020 10:05 AM

People Asking to Roshni Charity For Counseling on Coronavirus - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  ఒక్కరు..ఇద్దరు కాదు..కరోనా మహమ్మారి అనేక మందిని అనేక విధాలుగా వేధిస్తోంది. కల్లోలం రేపుతోంది. వైరస్‌ కారణంగా పెరుగుతున్న పాజిటివ్‌ రోగుల సంఖ్య ఒకవైపు  ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురి చేస్తుండగా, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా కేవలం  వైరస్‌ సోకుతుందేమోననే భయంతో  మరెంతోమంది  బాధపడుతున్నారు. దీనికితోడు  లాక్‌డౌన్‌ కారణంగా  పెరిగిన  ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల  మధ్య అవగాహన లేమి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతున్నట్టు    గ్రేటర్‌ హైదరాబాద్‌లో  ఆత్మహత్యల నివారణ కోసం పనిచేస్తున్న  స్వచ్ఛంద సంస్థ  రోష్ని  వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలు మొత్తం కలిపి 65  మంది ప్రతినిధులు ప్రస్తుతం  ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. 

కరోనాకు ముందు...తరువాత  
‘ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను ఇప్పుడు కరోనాకు ముందు, తరువాత అని చెప్పుకోవాల్సి  వస్తోంది. గతంలో ఎక్కువ శాతం  కుటుంబ కలహాలు, ప్రేమ విఫలమై  ఆత్మహత్యలకు  పాల్పడుతున్నట్టు  ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు కరోనా భయంపైనే  ఎక్కువగా వస్తున్నాయి. డిప్రెషన్, ఆందోళన, ఆత్మహత్యా ప్రవృత్తి  కనిపిస్తున్నాయి. ప్రతి రోజు 40 నుంచి  50 ఫిర్యాదులు కరోనాకు సంబంధించినవే ఉంటున్నాయి.’’ అని  చెప్పారు రోష్ని  సంస్థ  ప్రతినిధి  ఆనంద దివాకర్‌. ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా  ఆత్మహత్యల నివారణ  కోసం  రోష్ని  పని చేస్తోంది. అనేక అంతర్జాతీయ  సంస్థలతో కలిసి  కార్యాచరణ  రూపొందించుకున్న  ఈ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.  నగరంలో 1997  నుంచి  సేవలను అందజేస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మందిని ఆత్మహత్యా ప్రవృత్తి నుంచి బయటకు తీసుకురావడంతో పాటు, వారి సమస్యల పరిష్కారానికి సైతం కృషి చేస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా  ఆన్‌లైన్‌ ద్వారా  సమస్యలను  స్వీకరించి పరిష్కారం చూపుతున్నట్లు  ఆనంద  తెలిపారు. 

పెరుగుతున్న  అభద్రత  
లాక్‌డౌన్‌ కారణంగా  20 రోజులుగా నగరవాసులు ఇళ్లకే  పరిమితమయ్యారు. దీంతో బయటకు వెళితే  కరోనా సోకుతుందేమోననే భయం ఒక వైపు వెంటాడుతుండగా, మరోవైపు  ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు పోతాయేమోననే  భయం మధ్యతరగతి  వేతన జీవులను వెంటాడుతోంది. ఒకవైపు పేదలు, సామాన్య ప్రజలు ఇప్పటికే చేసేందుకు పనిలేక, ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటుండగా...మధ్య తరగతి వర్గాల్లోనూ  అభద్రత  క్రమంగా పెరుగుతున్నట్టు రోష్ని పేర్కొంది. ఆ సంస్థకు వస్తున్న ఫిర్యాదుల్లో  60  శాతం వరకు  కుటుంబాల్లో  తలెత్తే  ఆర్థిక సంక్షోభానికి  సంబంధించినవే ఉండడం గమనార్హం. 

ఎందుకో ఏమో....
మరోవైపు  లాక్‌డౌన్‌ కుటుంబ సభ్యులందరినీ ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ  టీనేజ్‌ పిల్లలతో పాటు, ఇరవై ఐదేళ్లు  పైబడిన యువతను మాత్రం ఒంటరితనం ఆవహించినట్లు  రోష్ని  అధ్యయనం  వెల్లడించింది. ఇటు కుటుంబ వాతావరణంలో పూర్తిగా ఇమిడిపోలేక, అటు స్నేహితులను కలిసేందుకు  అవకాశం లేక  గంటలతబడి ఒంటరిగా  గడిపేస్తున్నామని, జీవితంలో  ఏదో కోల్పోయినట్లుగా  అనిపిస్తోందని  చాలామంది యువతీ యువకులు  రోష్నిని సంప్రదిస్తున్నారు.  కరోనా అనంతర భవిష్యత్‌  కెరీర్‌ పైనా ఎలాంటి ప్రభావం చూపుతుందోననే భయం కూడా యువతను  వెంటాడుతోంది.  

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది
వివిధ వర్గాల నుంచి  వచ్చే సమస్యలు, ఫిర్యాదులపైన రోష్ని అధ్యయనం చేస్తున్నది. సమస్య స్వభావానికి అనుగుణమైన పరిష్కారం సూచిస్తుంది.  ప్రతి ఒక్కరికి భవిష్యత్‌ పట్ల  భరోసాను కల్పిస్తుంది. వారు ఎదుర్కొంటన్న సమస్య పరిష్కారమయ్యే వరకు తోడ్పాటుగా ఉంటుంది.  వారం రోజులుగా సుమారు 300లకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువ శాతం కరోనాతో ముడిపడినవే.–ఆనంద దివాకర్, రోష్ని ప్రతినిధి

Advertisement
Advertisement