70 ఏళ్లు దాటినా పింఛన్ ఇస్తలేరు! | Sakshi
Sakshi News home page

70 ఏళ్లు దాటినా పింఛన్ ఇస్తలేరు!

Published Mon, Dec 15 2014 11:12 PM

peoples are concern on pension

సంగారెడ్డి అర్బన్: తనకు 70 సంవత్సరాలు దాటినా పెన్షన్ మంజూరు కావడం లేదని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా  పెన్షన్ మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన మునగాల మల్లయ్య ఏజేసీ మూర్తికి ఫిర్యాదు చేశారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా సోమవారం  జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులను అందజేశారు. తన డబ్బుల సంచీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని రామచంద్రపురం  మండలం అశోక్‌నగర్‌కు చెందిన సుందర్రాజు విజ్ఞప్తి చేశారు.  

8 నెలలుగా తనకు రేషన్ సరుకులు అందడం లేదని, కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన అంతమ్మ విజ్ఞప్తి చేసింది. తనకు రెండు నెలలుగా పెన్షన్ అందడం లేదని, కొత్త జాబితాలో కూడా పేరు లేదని అధికారులు చెబుతున్నారని దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు కాలేదని,పెన్షన్‌తో పాటు కొత్త రేషన్ కార్డు ఇప్పించాలని నర్సాపూర్ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్ కోరారు. తాను కళాకారుడినని,  పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని రామాయంపేట మండలం ఝన్సీలింగాపూర్‌కు చెందిన టేకుమట్ల బసవయ్య విజ్ఞప్తి చేశారు.

తనకు రెండు నెలలుగా పింఛను అందడం లేదని అదే గ్రామానికి చెందిన టేకుమట్ల సాయిలు పేర్కొన్నారు. ఈ - పంచాయతీ కంప్యూటర్ అపరేటర్‌గా  8 నెలల క్రితం హైదరాబాద్‌లోని కార్వీ సంస్థలో శిక్షణ పూర్తిచేసినా అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ విషయమై అధికారులను కలిస్తే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని, నిరుద్యోగులమైన తమకు వెంటనే అపాయింట్‌మెంట్ ఆర్డర్  ఇప్పించాలని ఆపరేటర్లు రవీందర్, రామస్వామి, శ్రీనివాస్, శ్రీకాంత్ , వెంకటేష్, దామోదర్ కోరారు.   కార్యక్రమంలో ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement