ఇళ్లు అమ్ముకున్నారు! | Sakshi
Sakshi News home page

ఇళ్లు అమ్ముకున్నారు!

Published Sat, Sep 13 2014 1:35 AM

ఇళ్లు అమ్ముకున్నారు!

‘ఇందిరమ్మ’ ఇంటి బాగోతం    
- అక్రమాల్లో హౌసింగ్ సిబ్బందిదే కీలక పాత్ర
- రుద్రారంలో 50 ఇళ్లు అమ్ముకున్న ఘనులు   
- సీఐడీ విచారణలో వెలుగుచూసిన వాస్తవం
- రెండు రోజుల తర్వాత రికార్డుల పరిశీలన : సీఐడీ డీఎస్పీ
సాక్షి, కరీంనగర్ :
ఇందిరమ్మ ఇళ్లు అమ్ముడుపోయాయి.. సాక్షాత్తూ గృహనిర్మాణ శాఖ అధికారులే ఈ అవినీతికి తెరలేపారు. ఒకరి పేరిట ఇల్లు మంజూరు చేసిన అధికారులు అనర్హులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. లబ్ధిదారులకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇచ్చి.. అనర్హుల నుంచి డబ్బులు వసూలు చేశారు. మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో 50 ఇళ్లు ఇలాంటివే ఉన్నాయని సీఐడీ అధికారులు తేల్చారు. ఈ అక్రమాలు 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఒకటో, రెండో విడతల్లో చోటు చేసుకున్నాయి. అప్పటి డీఈఈ గ్రామంలో తిరిగి ఇల్లు మంజూరు చేస్తానని, వచ్చిన బిల్లులో సగం డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఇటీవలే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయూన్ని అధికారులు సీఐడీ ఐజీ చారుసిన్హా దృష్టికి తీసుకెళ్లారు.
 
అక్రమాలు 1500 పైనే..
గత నెల 14 నుంచి మల్హర్ మండలం రుద్రారం, పెగడపల్లి (మహాముత్తారం), రెడ్డిపల్లి, కొండపాక (వీణవంక) గ్రామాల్లో సీఐడీ డీఎస్పీ మహేందర్, సీఐ రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. వీటి పరిధిలో మంజూరై.. నిర్మాణం పూర్తయిన ఇల్లు మొత్తం 2,708 ఉన్నాయి. శుక్రవారం వరకు రుద్రారంలో 398 ఇల్లు మినహా సీఐడీ అధికారులు అన్ని ఇళ్లపై విచారణ పూర్తి చేశారు. అందులో 1,500 పైచిలుకు ఇళ్లలో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. రెడ్డిపల్లిలో 556 ఇళ్లు నిర్మిస్తే..480 ఇళ్లు, కొండపాకలో 334 ఇళ్లకు గాను 220 ఇళ్ల బిల్లుల చెల్లింపు అక్రమమని తేలింది.
 
రికార్డుల పరిశీలన..

ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణకు నెల రోజులు అరుుంది. రుద్రారంలో మిగిలిన 398 ఇళ్ల విచారణ రెండ్రోజుల్లోగా పూర్తి చేసేందుకు సీఐడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగిన అధికారులు ఆ తర్వాత కార్యాలయంలో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించారు. రికార్డులు పరిశీలనలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలుండడంతో గృహనిర్మాణ శాఖాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు తాము చేపట్టిన విచారణలో సగానికి పైగా ఇందిరమ్మ నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్టు తేలిందని సీఐడీ డీఎస్పీ మహేందర్ చెప్పారు. రుద్రారంలో ఓ డీఈఈపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారని ఆ విషయాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. జిల్లా అంతటా విచారణ పూర్తయ్యే వరకు కొన్ని నెలలు పట్టే అవకాశాలున్నాయని.. విచారణలో ఎవరి తప్పు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
ముగిసిన సీఐడీ విచారణ
రెడ్డిపల్లి(వీణవంక) : ఇందిరమ్మ ఇళ్లలో అవినీతిపై సీబీసీఐడీ చేపట్టిన విచారణ  ముగిసింది. గత నెల 14న సర్వే ప్రారంభించిన అధికారులు రెండు విడతలుగా తనిఖీ చేశారు.  రెడ్డిపల్లిలో 556 ఇళ్లు, కొండపాకలో 334 ఇళ్లు ఇందిరమ్మ పథకంలో మంజూరయ్యాయి. సీఐడీ డీఎస్పీ మహేం దర్, సీఐలు ప్రకాశ్, వెంకటనర్సయ్య శుక్రవారం రెండుబృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేశారు. 80 ఇళ్లు తనిఖీ చేశారు. ఇందులో ఒకే ఇంటికి మూడు బిల్లులు పొందగా, సింగరేణి ఉద్యోగులు, ఇల్లు కట్టకున్నా బిల్లులు పొందినట్లు బట్టబయలైంది. 556 ఇళ్లకుగాను 450 ఇళ్లలో అవినీతి జరిగినట్లు తేలింది. అక్రమాలకు పాల్పడినవారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని డీఎస్పీ మహేందర్ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement