ప్లీజ్..22 తర్వాత కలవండి! | Sakshi
Sakshi News home page

ప్లీజ్..22 తర్వాత కలవండి!

Published Wed, Jan 21 2015 4:36 AM

Please .. After 22 Meet!

ఇందూరు : ‘మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా ఇస్తాం.. కానీ ఏమనుకోకుండా ఈనెల 22 తర్వాత కలవండి. అప్పుడు ఏ పని కావాలంటే అది చేసిస్తాం..’ ప్రస్తుతం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అధికారులు, సిబ్బంది దాదాపు ఇదే సమాధానాలు చెబుతున్నారు. వారి దృష్టంతా ఇప్పుడు సీఎం కేసీఆర్ పర్యటనపైనే ఉంది. ఆయన ఈనెల 22న జిల్లాకు రానున్నారు.

ఇంకా ఒకేరోజు సమయం ఉండటంతో జిల్లాస్థాయి అధికారులు కలెక్టర్ నిర్వహించే సమీక్షల్లో పాల్గొనడంతో పాటు నివేదికల తయారీలో తలమునకలై ఉన్నారు. క్షణం తీరిక లేకుండా తమ సిబ్బందితో సీఎం ఏ శాఖపై ఎప్పుడు వివరాలు అడిగినా చెప్పేలా.. నివేదికల రూపంలో చూపేలా సిద్ధమవుతున్నారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలు తీరు, లబ్ధిదారుల వివరాలను మొత్తం సేకరించి తప్పులు లేకుండా సిద్ధం చేస్తున్నారు.

 

రెండు రోజులుగా సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ శాఖల వారీగా సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత సంవత్సరంతో పాటు ప్రస్తుత సంవత్సరానికి చెందిన పథకాల అమలు, నిధులు, పోస్టుల ఖాళీలు సమగ్ర నివేదికలను సెక్షన్ ఉద్యోగుల ద్వారా తయారు చేయిస్తున్నారు.
 
బిజీగా ఉన్నాం..
ప్రభుత్వ శాఖలో ఎవరిని కదిలించిన సీఎం నోట్స్ తయారు చేస్తున్నాం... కొద్దిగా బిజీగా ఉన్నాం... అనే మాటనే వినిపిస్తోంది. సీఎం పర్యటన బాధ్యతలను చూస్తున్న జిల్లా రెవెన్యూ శాఖ అధికారులైతే ఫైళ్లతో కుస్తీ పడుతున్నారు. తమ శాఖకు సంబంధించిన భూ పంపిణీ తదితర వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. ప్రధాన సమస్యగా మారిన పింఛన్ల పంపిణీ విషయంలో ఐకేపీ, డీఆర్‌డీఏ అధికారులు సవాల్‌గా తీసుకుంటున్నారు. స్వయంగా కలెక్టరే ఈ విషయంలో ప్రాధాన్యతనిచ్చి.. జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన పెన్షన్లు, నిలిచినవి, దరఖాస్తుల సంఖ్య తదితర వివరాలను సేకరిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు, పూర్తి చేసిన లక్ష్యం లాంటి సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేస్తున్నారు.
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు వచ్చిన నిధులు, ఇంకా కావాల్సిన నిధుల వివరాలతో పాటు సంక్షేమ వసతిగృహాల వివరాలు, విద్యార్థుల సంఖ్య, కొత్త భవనాల నిర్మాణాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల పథకాల సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కార్పొరేషన్ శాఖలైతే ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు, మంజురైన నిధులు, ఇంకా కావాల్సిన రుణాల వివరాలు, సాధించిన ప్రగతిని కాగితాల్లోకి ఎక్కిస్తున్నారు.

డ్వామా కార్యాలయంలో నుంచి ఉపాధి పనులు, నర్సరీల పెంపకం, జిల్లా పరిషత్ నుంచి బీఆర్‌జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు, పనులు, పంచాయత్‌రాజ్ శాఖ నుంచి నిర్మిస్తున్న భవనాలు, గ్రామీణ రహదారుల వివరాలు, వచ్చిన నిధులు నివేదికల రూపంలో తయారు చేస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీల్లో అమలవుతున్న ఆరోగ్య లక్ష్మి పథకం, బంగారు తల్లి, బాలల సంరక్షణ విభాగం, ఇతర వివరాలు సిద్దం చేస్తున్నారు.

ఇటు జిల్లా పంచాయతీ శాఖ అధికారులు ఈ- పంచాయతీ అమలుపై సమగ్ర నివేధికలు రూపొందిస్తున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మరుగుదొడ్లు, నీటి ట్యాంకుల నిర్మాణాలు, పైపు లైన్లు, వాటర్ గ్రీడ్ సర్వే వివరాలను సమగ్రంగా నివేధిలో పొందుపరుస్తున్నారు. వైద్య, ఆరోగ్య, ఆర్‌వీఎం, శాఖల అధికారులు పాఠశాలలు, ఆసుపత్రుల సౌకర్యాలు, వైద్యులు, టీచర్ల వివరాలను డివిజన్‌ల వారీగా తయారు చేశారు. వ్యవసాయ శాఖ, హర్టికల్చర్ అధికారులూ సీఎం పర్యటనకు సిద్ధమవుతున్నారు.
 
కామారెడ్డికి చక్కర్లు
సీఎం కేసీఆర్ కామారెడ్డికి రానున్న నేపథ్యంలో అక్కడి మండల అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న అంగన్‌వాడీలు, పాఠశాలలు, ఆసుపత్రిలు, వసతిగృహాలు, పోలీసు స్టేషన్‌లు, ఇతర శాఖలకు సంబంధించిన వాటిలో లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి జిల్లా అధికారులు రెండు రోజులుగా కామారెడ్డికి చక్కర్లు కొడుతున్నారు. సీఎం పర్యటనలో లోటుపాట్లు తలెత్తకుండా క్షేత్ర స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Advertisement
Advertisement