జీబులకు జేబులు! | Sakshi
Sakshi News home page

జీబులకు జేబులు!

Published Sat, Jul 12 2014 4:51 AM

జీబులకు జేబులు! - Sakshi

వరంగల్ క్రైం : పోలీస్ శాఖ.. అందులో వాహనాల విభాగమది.. పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగించే జీపులు, తదితర వాహనాల నిర్వహణ వ్యవహారాలను సరిచూసుకునే పని అతడిది. పని ఏదైతేనేం తనకు పైకం కావాలనుకున్నాడా అధికారి. అంతే... తన ఆలోచనకు పదునుపెట్టాడు. అందినకాడికి తన ఖాతాలో జమ చేసుకుంటున్నాడు. ప్రతిష్ఠకు ముడిపడి ఉన్న పోలీస్ శాఖలో  అవినీతికి తెరతీసిన ఆ భక్షకభటుడి బాగోతం చర్చనీయాంశంగా మారింది.
 
డీజిల్ కోటాలో కోత..
వరంగల్ అర్బన్, రూరల్ పరిధిలోని వాహనాలకు కావాల్సిన ఇంధనంతోపాటు, వాటి మరమ్మతుల బాధ్యతలు సదరు అధికారే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో వాహనానికి సరిపడే డీజిల్ కోసం నెలవారీగా కూపన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సదరు అధికారి మాత్రం డీజిల్ కోతలో నెలవారీ కోటాలో వంద లీటర్ల వరకు కోత పెడుతున్నట్లు తెలిసింది. ఉదాహరణకు.. నగరం పరిధిలో నాలుగు రక్షక్, ఒకటి వజ్ర, ఏడు పెట్రోలింగ్ జీపులు ఉన్నాయి. వీటికి ఒక్కో వాహనానికి రోజువారీగా పది లీటర్ల చొప్పున నెలకు 300 లీటర్ల డీజిల్ కేటాయించాలి. అయితే, ఒక్కో వాహనంపై వంద లీటర్లకు కోత విధిస్తున్నాడు సదరు అధికారి.

 ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.60గా ఉంది. అంటే ఒక్క వాహనంపైనే నెలవారీగా రూ.6వేల వరకు సదరు అధికారి జేబులోకి వెళ్తున్నాయన్నమాట. నగరం పరిధిలో ఏడు వాహనాలకు లెక్కేసుకుంటే 42వేల రూపాయలు..! నొక్కేస్తున్నాడు. అంతేకాదు, వాహనాలు మరమ్మతుకు చేరుకుంటే వాటిని సరిచేసేందుకు డబ్బులు చెల్లించే బా ధ్యత కూడా ఆ అధికారిదే. తమ వాహనం రిపేరుకొచ్చిం దని.. ఏ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిబ్బంది అయినా... వ స్తే చిన్నచిన్నవి మీరే చూసుకోవాలని ఉచిత సలహా అం దిస్తాడని ప్రచారంలో ఉంది. అలా మరమ్మతుల సొమ్ము ను కూడా వెనకేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది.
 
ఇలా నొక్కేసి.. అలా అమ్మేసి..

డీజిల్ కోటాలో కోత విధిస్తున్న అధికారి ఆ ఇంధనాన్ని భీమారం సమీపంలోని ఒక పెట్రోల్‌బంక్‌కు రెండు.. మూడు రోజులకోకసారి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత డీజిల్‌ను డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా ప్రభుత్వ డీజిల్‌ను ప్రైవేటు బంక్‌లకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
 
ఎందుకిదంతా...
ఇటీవల ఆ అధికారి గోపాలపురంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు తెలిసింది. సొంత డబ్బు ఎందుకు తీయాలనుకున్నాడో ఏమో.. ఇలా సర్కారు సొమ్మును వాడుకుంటున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు హోంగార్డులను ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. రక్షక్, పెట్రోలింగ్, సీఐ వాహనాలకు ఒక హోంగార్డు, ఏఆర్ కానిస్టేబుల్ డ్రైవర్లుగా ఉంటారు. ఇలా అర్బన్, రూరల్  పరిధిలో కలిపి 80మంది వరకు సిబ్బంది ఉంటారు. అయితే హోంగార్డుల విధులు ప్రతీనెల మారుతుంటాయి. అది ఈ అధికారి చేతుల్లోనే ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకున్న అతడు తన మాట వినేవారిని డబ్బు దండుకునేందుకు అనువైన చోట నియమించుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు ప్రతిఫలంగా హోంగార్డులతో తన ఇంటికి అవసరమైన సామగ్రిని ఉచితంగా తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

Advertisement
Advertisement