పోలీసులంటే ప్రజల్లో భయాన్ని పోగొట్టాలి | Sakshi
Sakshi News home page

పోలీసులంటే ప్రజల్లో భయాన్ని పోగొట్టాలి

Published Wed, Jun 17 2015 12:11 PM

పోలీసులంటే ప్రజల్లో భయాన్ని పోగొట్టాలి - Sakshi

నేరాలను నియంత్రించాల్సిందే..
విధుల పట్ల అలసత్వం వహిస్తే
ఉపేక్షించేది లేదు
ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్

 
నల్లగొండ క్రైం : పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ సిబ్బందికి సూచించారు. అందుకు ప్రజలతో స్నేహపూర్వంగా మెలగాలని, ఆప్యాయంగా పలకరించాలని సూచిం చారు. డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనమైత్రి పోలీస్ వ్యవస్థను దీనికోసమే ఏర్పాటు చేసినట్టు వివరించారు. నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ శక్తి వంచన లేకుండా కృషిచేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోనని హెచ్చరించారు.  మహిళలకు భద్రత కల్పించేందుకే షీటీమ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. వారు తమ విధులు సక్రమంగా నిర్వర్తించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మహిళా సమస్యలను పరిష్కరించేందుకు స్నేహిత బృందాలు గ్రామాల్లో పర్యటించాలన్నారు.

కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. నేరాలను తగ్గించేందుకు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో బీట్లను అప్రమత్తం చేస్తూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. వాహనాల తనిఖీలో సరైన జాగ్రత్త వహించాలని, రోడ్డు ప్రమాదాలు కాకుండా సామర్థ్యానికి మించి రవాణా చేసే వాహనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. రహదారుల వెంట చెక్‌పోస్టులను మరింత పటి ష్టం చేసి ఆంధ్రారాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలని అన్నారు. మద్యం దుకాణాల పనిగంటలను కచ్చితంగా అమలు చేయాలని, బె ల్టుషాపులను,అక్రమ సిట్టింగ్‌లను నిర్మూలించాలని ఆదేశించారు.

‘యాత్ర’ నిర్వహించిన పోలీసులకు అభినందన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా సైకిల్ యాత్ర నిర్వహించిన పోలీసు సిబ్బందిని శాలువాలతో అభినందించారు. హరితహారం కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూడా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. మిషన్‌కాకతీయలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అభినందించారు. నిరుద్యోగులకు పోటీపరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తు పోలీసుశాఖ నిరుద్యోగులకు మరింత చేరువైందన్నారు. సమావేశంలో ఏఎస్పీ గంగారాం, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement