Sakshi News home page

ప్రతి స్టేషన్కు ఫేస్‌బుక్ ఐడీ

Published Wed, Sep 24 2014 11:54 PM

ప్రతి స్టేషన్కు ఫేస్‌బుక్ ఐడీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: పోలీసులు తమ సేవలు వేగవంతం చేసేందుకు సోషల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని 62 శాంతి భద్రత పోలీసుస్టేషన్లకు ఐటీ విభాగం అధికారులు ఫేస్‌బుక్ ఐడీ కేటాయిస్తున్నారు. ప్రజల వద్దకు పోలీసులు అన్న నినాదంలో భాగంగా ఫేస్‌బుక్ ఐడియాకు వచ్చారు.

 ఒక్కో ఠాణాకు ఒక్కో ఫేస్‌బుక్ ఐడీ ఉంటుంది. దాని పాస్‌వర్డ్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (ఇన్‌స్పెక్టర్) వద్ద ఉంటుంది. ప్రజలు ఠాణా మెట్లు ఎక్కకుండానే తమ సమస్యను ఫేస్‌బుక్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చు. బస్తీలు, కాలనీలలో అసాంఘిక శక్తుల కదలికలు, వైన్‌షాప్‌ల వద్ద మందుబాబుల ఆగడాలు, రౌడీల బెదిరింపులు, కళాశాలలు, షాపింగ్ సెంటర్లు, నెట్ సెంటర్ల వద్ద మహిళలను వేధించే పోకిరీల గురించి ఆయా పరిధిలోని ఠాణాల ఫేస్‌బుక్ ఐడీకి సమాచారం ఇవ్వవచ్చు. ఫేస్‌బుక్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ పోలీసుల ఫేస్‌బుక్‌ను తమ అకౌంట్‌తో జత చేసుకోవచ్చు.

 ఫేస్‌బుక్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు చూసుకుని వెంటనే స్పందిస్తారు. అలాగే ఫేస్‌బుక్ ద్వారా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఠాణాలతో పాటు 17 ఏసీపీ డివిజన్లు, ఐదు జోన్ కార్యాలయాలకు సైతం ఫేస్‌బుక్ ఐడీ కేటాయిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   

 న్యాయం జరగకపోతే పైఅధికారుల దృష్టికి..
 ఠాణాలో తమ న్యాయం జరగడంలేదని, అక్కడి అధికారి నిందితులకు వత్తాసు పలుకుతున్నారని బాధితుడు భావిస్తే ఫేస్‌బుక్ ద్వారా ఆ విషయాన్ని డీసీపీ దృష్టి తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ ఠాణా పరిధిలోని ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలతో పాటు సిబ్బంది పారదర్శకతతో పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement
Advertisement