పోలీసులు కావలెను! | Sakshi
Sakshi News home page

పోలీసులు కావలెను!

Published Thu, Jun 7 2018 11:21 AM

Police wanted! - Sakshi

ఖమ్మంరూరల్‌ : పోలీస్‌ అధికారులను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కేసుల దర్యాప్తునకు ఇది అవరోధంగా మారుతోంది. విశ్రాంతి లభించక, సెలవులు దొరక్క పోలీసులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు ఉద్యోగుల ఖాళీలు భర్తీకి నోచుకోకపోవడంతో నేరాల సంఖ్య అదుపులోకి రావడం లేదు. 

 వైట్‌ కాలర్‌ నేరాలు, చైన్‌ స్నాచింగ్, పట్టపగలే చోరీలు, దొమ్మీలు, దోపీడీలతో పోలీసులకు కంటిపై కునుకు ఉండడం లేదు. వీటికి.. ప్రేమ పేరిట వేధింపులు, యువతీయువకుల అదృశ్యం కేసులు అదనం.  ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు దశాబ్దాల క్రితం నాటి  ఉద్యోగుల సంఖ్యనే నేటికీ కొనసాగుతోంది.

ఇక్కడ ముగ్గురు ఎస్‌ఐలు ఉండాలి. ఇద్దరే ఉన్నారు. హెడ్‌ కానిస్టేబుళ్లు నలుగురికి ముగ్గురే ఉన్నారు. 30మంది కానిస్టేబుళ్లకుగాను 26 మంది ఉన్నారు. మిగతా నలుగురు కోర్టు కేసులు, చెక్‌పోస్ట్‌ విధుల్లో ఉంటున్నారు. మహిళా పోలీసులు ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం పెరిగిన జనాభాతో పోల్చితే ఈ సిబ్బంది సంఖ్య ఏమాత్రం చాలదు.

ఇప్పుడున్న సంఖ్యకు రెట్టింపు అవసరమవుతుంది. సిబ్బంది కొరత కారణంగా కేసుల దర్యాప్తు ఆలస్యమవుతోంది.  దశాబ్దం క్రితం వరకు నక్సల్స్‌ ఏరివేత కూంబింగ్‌ కోసం పోలీసులు రేయింబవళ్లు శ్రమించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వర్తించారు.

తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి హింసాత్మక  ఘటనలు జరగకుండా రేయింబవళ్లు కాపలా కాశారు. ప్రస్తుతం రూరల్‌ ఏరియాలో రోజుకు రెండు మూడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో ఎక్కడ ఏ నేరం జరుగుతుందో తెలియదు. ఇందుకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందేర్పడుతోంది.

Advertisement
Advertisement