చెరువులకు మహర్దశ | Sakshi
Sakshi News home page

చెరువులకు మహర్దశ

Published Thu, Jan 8 2015 4:11 AM

చెరువులకు మహర్దశ

సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో చెరువులకు పూర్వవైభవం రానుంది. వాటి మరమ్మతులకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకనుగుణంగా మిషన్ కాకతీయ ద్వారా మొదటి విడతలో 1266 చెరువులు ఎంపికయ్యాయి. దీంతో పూడికతో నిండిపోయిన చెరువులు, కుంటల్లో యుద్ధప్రాతిపదికన ఒండ్రుమట్టిని తీయడంతో పాటు వాటికి వచ్చే వరద కాలువలను బాగుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఒక్కో చెరువు స్థాయినిబట్టి రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఖరీప్ నాటికి వీటిని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అందుకోసం జనవరి 27నుంచి టెండర్లు నిర్వహించేం దుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఎంపికైన చెరువుల చిట్టాను జిల్లా చిన్ననీటిపారుదల అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేయనున్నారు.
 
ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు...
జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వంద ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819 ఉన్నాయి. వీటికింద 82,722 ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ చెరువులను 30 ఏళ్లుగా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఒండ్రుమట్టితో పూడిపోయాయి. వీటికి వరద వచ్చే కాల్వలు కూడా మట్టితో నిండి చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ చెరువులలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండటం లేదు.

దీంతో వాటికింద సాగవ్వాల్సిన ఆయకట్టు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం చెరువులన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా మొదటి విడతలో భాగంగా 20శాతం చెరువులను బాగుపరచాలనుకొంది. అందుకోసం ఆయా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని చెరువులను మొదటి ప్రాధాన్యతగా వేటిని చేపట్టాలో సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలందరూ వారి ప్రాధాన్యతను అధికారులకు అందజేశారు.

ఇలా మొత్తం మీద ఎమ్మెల్యేల నుంచి 1569 చెరువులకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 20శాతం మించకుండా ఉండేం దుకు అధికారులు స్క్రూటినీ చేశారు. ఇలా మొత్తం మీద 1266 చెరువులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.  

చెరువులన్నీ ఖాళీయే..
ఈ ఏడాది కురిసిన వర్షాలు అంతంత మాత్రంగా ఉండడం, పడినచోట్ల వరద కాలువలు సరిగా లేని కారణంగా జిల్లాలోని చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గా వర్షాలు కురవడంతో పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. ఈ డివిజన్ పరిధిలో 318 పెద్దవి, 2646 చిన్న చెరువులున్నాయి. వీటిలో చిన్నా, పెద్దా కలిపి మొత్తం 334 నిండాయి. చెరువుల నిర్వాహణ సరిగా లేకపోవడంతో 46 చెరువులకు గండ్లు పడ్డాయి.

ఇక వనపర్తి డివిజన్ పరిధిలో 152 పెద్దవి, 1,069 చిన్న చెరువులున్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 223 పెద్దవి, 2,104 చిన్న చెరువులున్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువు పూర్తిస్థాయిలో నిండకపోగా... ఐదు చెరువులకు గండ్లుపడి ఉన్న నీరంతా వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితి వచ్చే ఏడాది నుంచి చెక్‌పడనుంది. గతంలో మాదిరిగా చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండనుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
చెరువుల వివరాలు
 
 డివిజన్            చెరువులు        మిషన్ కాకతీయకు        ఎమ్మెల్యేలు
                                                           ఎంపిక            ప్రతిపాదించినవి

 మహబూబ్‌నగర్    1,872            375                    413
 వనపర్తి                  1,480            295                    280
 నాగర్‌కర్నూల్        1,670            336                    576
 నారాయణపేట        1,301            260                    300

Advertisement

తప్పక చదవండి

Advertisement