మంత్రి హరీష్‌కు మాజీ ఎంపీ సవాల్‌ | Sakshi
Sakshi News home page

మంత్రి హరీష్‌కు మాజీ ఎంపీ సవాల్‌

Published Sat, May 13 2017 7:41 PM

మంత్రి హరీష్‌కు మాజీ ఎంపీ సవాల్‌

కరీంనగర్: ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడుతోందని మంత్రి హరీశ్‌రావు పదేపదే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాంగ్రెస్ చేసిందేమిటో.. టీఆర్‌ఎస్‌ చేసిందేమిటో తేల్చుకుందామని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. ఇందుకు మంత్రి హరీష్‌రావు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. కరీంనగర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 2013లో భూసేకరణ చట్టాన్ని అమోదించిందని, అప్పుడు కేసీఆర్‌ కూడా లోక్‌సభ సభ్యుడేనని గుర్తుచేశారు.

2013 భూసేకరణ చట్టం రైతులను ముంచేలా ఉందని పదేపదే వల్లేవేస్తున్న మంత్రి హరీష్‌రావు.. ఎంపీగా కేసీఆర్‌ ఆ చట్టానికి ఎలా ఆమోదం తెలిపి ఓటు వేశారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరిట కాలయాపన చేస్తూ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం హరీష్‌రావుకు తగదన్నారు. తాజాగా 2013 భూసేకరణచట్టాన్ని అమలుచేయకుండా ఉభయసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతుల, భూనిర్వాసితుల నోట్లో మట్టికొట్టే చర్యలకు టీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్నవాటి కంటే భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామని, ఏ ఒక్క నిబంధన రైతులకు హానికలిగేలా ఉన్నా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement