పీఠం కోసం కిడ్నాప్ | Sakshi
Sakshi News home page

పీఠం కోసం కిడ్నాప్

Published Mon, Jun 30 2014 1:58 AM

పీఠం కోసం కిడ్నాప్ - Sakshi

- టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్‌ను..
- ఆయుధాలలో బెదిరించి తీసుకెళ్లారు
- కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు
- మాజీ మావోయిస్టుల సహకారం
- హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సీరియస్
 ఆర్మూర్ :
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రె స్, టీఆర్‌ఎస్ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎత్తులకు పైఎత్తులు వేయడం ప్రారంభించాయి. అందులో భాగంగా శనివారం అర్ధరాత్రి 20వ వార్డు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి శం కర్ ఆర్మూర్ పట్టణంలోని తన ఇంటి వద్ద నుంచి కిడ్నాప్‌కు గురయ్యాడు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి అయిన బొగడమీది శ్రీదేవి భర్త అయిన కాంగ్రె స్ సీనియర్ నాయకుడు ఏబీ శ్రీనివాస్ (చిన్న), కాంగ్రెస్ నా యకులు మహేందర్, ఫత్తేపూర్ అశోక్ రెడ్డి, మాజీ మావోయిస్టు పచ్చలనడ్కుడ అన్వేష్, బట్టు శంకర్,  సుంకెట చిన్న గంగారాం, అమర్ భూషణ్‌లు ఆయుధాలతో బెదిరించి టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన భార్య సుంకరి స్వప్న ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేశారు.

ఆర్మూర్ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి చేరవేయడంతో ఆయన ఈ విషయమై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. అక్రమ ఆయుధాలతో మాజీ మావోయిస్టుల సహకారంతో కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా పోలీస్ బాస్‌కు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో స్వప్న ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆరుగురిపై కిడ్నాప్, అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నారనే కేసులు నమోదు చేశారు.

మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోకుండా చేసి టీఆర్‌ఎస్ పార్టీ బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ నాయకులు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఐదు రోజుల ముందు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్‌కు గురి కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
 
మారుతున్న బలాలు..
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా కష్యప్ స్వాతి సింగ్ బబ్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి బొగడమీది శ్రీదేవి శ్రీనివాస్ బరిలో నిలిచారు. పట్టణంలోని 23 వార్డుల్లో 11 స్థానాలను కాంగ్రెస్, 10 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోగా బీజేపీ, టీడీపీ చెరొక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా కొనసాగడానికి తమ సమ్మతి పత్రాలను అందజేశారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ బలం 12కు చేరింది. టీడీపీ కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచా రం.

మరో వైపు నెల రోజుల పాటు టీఆర్‌ఎస్ క్యాంపులో కొనసాగిన బీజేపీ కౌన్సిలర్ ద్యాగ ఉదయ్ కుమార్ సైతం తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు వదంతులు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఎవరికి ఓటు వేయమంటే వారికి ఓటు వేస్తానని బీజేపీ కౌన్సిలర్ పేర్కొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇంతలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్‌కు గురి కావడంతో టీఆర్‌ఎస్ నాయకులు గందరగోళంలో పడిపోయారు.

ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు ఉన్నప్పటికీ అధికారం కైవసం చేసుకోవడంలో టీఆర్‌ఎస్ నాయకులు అష్ట కష్టాలనే పడుతున్నారు. టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసిన వారిని పోలీసుల సహకారంతో అరెస్టు చేయించి తమ పార్టీ కౌన్సిల ర్‌ను తమ శిబిరానికి తిరిగి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement