ఓకే అంటే.. అందరూ అర్హులే! | Sakshi
Sakshi News home page

ఓకే అంటే.. అందరూ అర్హులే!

Published Tue, May 26 2015 2:43 AM

Power supply company Jenco jobs on june 2

పూర్తిగా ఓపెన్ కేటగిరీలో విద్యుత్ కొలువుల భర్తీ
స్థానిక కోటాపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరిన టీ జెన్‌కో
 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల నియామకాల్లో స్థానిక రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలా? లేక స్థానిక కేటగిరీ లేకుండా పూర్తిగా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేయాలా? అన్న అంశంపై విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున నిరుద్యోగుల కలలు సాకారం చేసేందుకు పూర్తిగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలంటూ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాసిన లేఖ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో వుంది. తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ దినం కానుకగా జూన్ 2న ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.  
 
 రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం తెలంగాణలో సైతం స్థానిక రిజర్వేషన్లు కొనసాగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు కార్పొరేషన్లు కావడంతో ఆర్టికల్ 371డీ అమలుకు ఆస్కారం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ‘371డీ’ స్ఫూర్తితో స్థానిక రిజర్వేషన్లు అమలు చేశాయి. ఎల్‌డీసీ/టైపిస్టు తత్సమాన హోదా గల జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో 80 శాతం స్థానిక, 20 శాతం ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు అమలు చేశాయి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సబ్ ఇంజనీర్ తత్సమాన హోదా గల జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో 70 శాతం స్థానిక, 30 శాతం ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు అమలు చేశాయి. జోనల్ పోస్టులైన ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల విషయంలో మాత్రం 60 శాతం స్థానిక, 40 శాతం ఓపెన్ కోటాను వర్తింపజేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా, జోనల్ ‘స్థానికత’తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ కేటగిరీ పోస్టుకైనా ఇక్కడి నిరుద్యోగ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి.
 
 వారం రోజుల్లో ప్రకటనలు!
 విద్యుత్ సంస్థల్లో 1,492 ఏఈ పోస్టులు, 427 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గత నెల 28న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్‌కోలో 788 ఏఈలు, 16 సబ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కోలో 62 ఏఈలు, 42 సబ్ ఇంజనీర్లు, ఎస్పీడీసీఎల్‌లో 376 ఏఈలు, 139 సబ్ ఇంజనీర్లు, ఎన్పీడీసీఎల్‌లో 266 ఏఈలు, 230 సబ్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. స్థానిక కోటా విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు విద్యుత్ సంస్థలు ముసాయిదా నోటిఫికేషన్లతో సిద్ధమై ఉన్నాయి. అందువల్ల వారం రోజుల్లో ప్రకటనలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
 

Advertisement
Advertisement