పెట్టుబడికి ‘ప్రీ పెయిడ్‌’ కార్డులు | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి ‘ప్రీ పెయిడ్‌’ కార్డులు

Published Mon, Feb 26 2018 2:18 AM

Prepaid Cards for Farmers Investment Scheme Says KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘రైతు పెట్టుబడి పథకానికి బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయిస్తాం. మేలో ఇవ్వబోయే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో ఇస్తాం. నవంబర్‌లో(రబీ) అందించబోయే రెండో విడత సాయం నుంచి ప్రీపెయిడ్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్‌ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు మంజూరు చేస్తాం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఈ యాసంగి నుంచే రైతు సమన్వయ సమితులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. 1.61 లక్షల రైతు సమన్వయ సమితుల సభ్యులంతా రైతు సైన్యమని, వారంతా ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌ కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ఉన్నంతవరకు రైతు సమితులు ఉంటాయన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రైతు సదస్సుకు 13 జిల్లాలకు చెందిన మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ సమితులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ఖరారు చేసి, ఆయన్ను సభ్యులకు పరిచయం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘నాలుగైదు ఏళ్ల తర్వాత నాట్లు వేసేవాళ్లు దొరకరు. ప్రతి 5 ఎకరాలకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాల లెక్క తెలియాలి. నాట్లు వేసే యంత్రాలను 50 శాతం సబ్సిడీతో ఇస్తం. ఎక్కడ ఏ యంత్రాలు సమకూర్చాలో ప్రభుత్వం నిర్ణయిస్తది. అందరూ ఒకే పంట వేస్తే అందరికీ నష్టం. అధికారులు సూచించిన పంటలు పండిస్తే రైతులకు లాభం.

మున్ముందు పంట కాలనీలను ఏర్పాటు చేస్తం. రైతు సమన్వయ సమితిలో పైరవీలకు ఆస్కారం ఉండొద్దు. రైతు సమన్వయ సమితి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో కూర్చోదు. రైతు బాగుపడే వరకు చిత్తశుద్ధితో పని చేస్తం’’అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం లంచాలు ఇచ్చుడు బంద్‌ అని, పాస్‌బుక్‌ ఇవ్వడంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆలస్యం చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని చెప్పారు. పాస్‌పోర్టు వచ్చినట్టే పాస్‌బుక్కులు కూడా పోస్టులో ఇంటికి వస్తాయన్నారు.

రైతుల సంపద.. 1.25 లక్షల కోట్లు
‘‘మార్కెట్‌కు తెచ్చే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే వర్షాకాలపు పంట ఒక్క గింజ కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మనివొద్దు. చెక్కుల పంపిణీలో క్రమశిక్షణ పాటించిన గ్రామాల రైతులను ఇజ్రాయెల్‌ పంపేందుకు ఏర్పాట్లు చేస్తం. రైతులకు 75 శాతం సబ్సిడీతో టార్పాలిన్లను ఇస్తాం. అటవీ శాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గిస్తం. సబ్సిడీపై సోలార్‌ ఫెన్సింగ్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం’’అని వెల్లడించారు.

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే రాష్ట్రంలో రెండు పంటలు పండుతాయన్నారు. రెండు పంటల ద్వారా వచ్చే పంట విలువ రూ.1.25 లక్షల కోట్లు ఉంటుందని, ఇది రైతులకు చేరే సంపద అని పేర్కొన్నారు. తెలంగాణ మొత్తాన్ని అంకాపూర్‌ను మించి తీర్చిద్దాలని అప్పుడే రైతు సమన్వయ సమితులు విజయం సాధించినట్లని వ్యాఖ్యానించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు అంకాపూర్‌ గ్రామాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రికి సూచించారు.

‘పెట్టుబడి’సొమ్ము వదులుకుంటున్నా
‘‘నాకు పెట్టుబడి పథకం కింద సొమ్ము వస్తుంది. కానీ దాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నా. ఇలా పెద్దలు పెట్టుబడి సొమ్మును వదులుకుంటే.. ఆ సొమ్మంతా రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో జమ అవుతుంది. కార్పస్‌ఫండ్‌గా ఉంటుంది’’అని సీఎం చెప్పారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఆరేడు కోట్ల రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తామన్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉందన్నారు.

‘‘రైతు సమితులు వస్తే స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని కాంగ్రెస్‌ వారు అంటున్నారు. రైతులకు సంస్థను ఏర్పాటు చేస్తే సన్నాసి మాటలు మాట్లాడున్నారు. కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతు సమితులు ఉంటాయి. వాటిని ఎవరూ రద్దు చేయలేరు’’అని పేర్కొన్నారు. రైతు సమితులు పైరవీలకు ఆస్కారం ఇవ్వొదన్నారు. మే నెలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గ్రామాల్లో పెట్టుబడి పథకం చెక్కుల్ని పంపిణీ చేయాలన్నారు. వచ్చే వానాకాలం పంటను కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా అమ్ముతామని సమితులు ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. సర్వే చేస్తే సీఎంగా తనకు 90 శాతం మార్కులు వచ్చాయని, కేసీఆర్‌గా 93 శాతం వచ్చాయని చెప్పారు.

అలా చేస్తే మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తా..
‘‘ఖమ్మం మార్కెట్లో మిర్చి గొడవకు కారణమేంటి? ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం వల్లే ఇదంతా జరుగుతుంది. కాబట్టి నియంత్రిత వ్యవస్థ ఏర్పడాలి. ఏ గ్రామాలు ఎప్పుడు మార్కెట్‌కు తీసుకురావాలో రైతు సమితులు నిర్ణయించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే నేను కూడా మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తా’’అని సీఎం అన్నారు. రైతు సమితులు దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధరకు ఆహార పంటలను అమ్ముకునేందుకు అనుమతిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.62 కోట్ల ఎకరాల భూమి తేలిందని, అందులో 1.42 కోట్ల ఎకరాలు రైతులవని చెప్పారు.

మరో 20 లక్షల ఎకరాలు అసైన్డ్‌ భూములని, మరో 2–3 లక్షల ఎకరాలు వివాదాస్పద అసైన్డ్‌ భూములని వివరించారు. అటుఇటుగా 1.65 కోట్ల ఎకరాలు తేలుతుందని, ఈ భూమి కలిగిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. తెలంగాణలో ఇక కరెంటు పోదు కాబట్టి ఆటో స్టార్టర్లను తీయించే బాధ్యత రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని కోరారు. 24 గంటల కరెంటు వద్దు... 12 గంటలే కావాలని కొందరంటున్నా అలా చేయబోమని స్పష్టంచేశారు. రెవెన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్లే మంచిగా పనిచేస్తే వ్యవసాయాధికారులకు కూడా ఇస్తామన్నారు.

ఉద్యోగుల జీతాలు పెంచుతామని, అయితే వారంతా లంచం లేకుండా పనిచేయాలని అన్నారు. అసైన్డ్‌ రైతులకు కూడా పెట్టుబడి సాయం అందజేస్తామని, ఉద్యాన, పండ్ల రైతులకు కూడా రూ.4 వేల చొప్పున సాయం చేస్తామన్నారు. సదసుసలో సూర్యాపేటకు చెందిన మాలోత్‌ కృష్ణ.. ఫిలిఫ్‌పైన్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న తన కూతురి కష్టం గురించి చెప్పారు. ఓవర్‌సీస్‌ పథకం కింద స్కాలర్‌షిప్‌ ఇవ్వనంటున్నారంటూ ఏడుస్తూ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

దీనికి వెంటనే స్పందించిన సీఎం స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని తాను ఇప్పిస్తానని హామీయిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జగదీష్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి, మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని మండలాల్లో మార్కెట్‌ మినీ యార్డులు: హరీశ్‌
ఇప్పటివరకు రాష్ట్రంలో 25 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో మినీ మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఇందుకు కేంద్రం సహకారం కోరుతామన్నారు. కాగా, రైతు వేదికలకు ఎకరం భూమి విరాళంగా ఇచ్చిన మక్తల్‌ నియోజకవర్గ రైతు వెంకటరెడ్డిని సీఎం సన్మానించారు.

‘ఉపాధి’పై కేంద్రం స్పందించడం లేదు
‘‘ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సభను చూసైనా కేంద్రం బుద్ధి తెచ్చుకోవాలి. ఇదే అంశంపై ప్రధానికి ఇప్పటివరకు 20 ఉత్తరాలు రాశా. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపా. అయినా అక్కడి నుంచి స్పందన లేదు’’అని సీఎం అన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఈ సదస్సులోనూ తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. మళ్లీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో రైతుల కోసం పనిచేయలేదని విమర్శించారు. రైతుకు ఏదైనా చేయాలని ప్రధానికి పదిసార్లు చెప్పానని, అయినా కేంద్రం నుంచి సహకారం లభించడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.

నేడు కరీంనగర్‌లో సదస్సు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ ప్రాంతీయ రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సోమవారం కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 16 జిల్లాల నుంచి మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజాప్రతిని«ధులు సుమారు 10 వేల మంది వరకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement