అధ్యక్షా.. | Sakshi
Sakshi News home page

అధ్యక్షా..

Published Fri, May 23 2014 2:34 AM

Presidential ..

సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ జిల్లాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. జిల్లాలో మాత్రం సంతృప్తికరమైన ఫలితాలనే రాబట్టింది. భువనగిరి ఎంపీ, నకిరేకల్, ఆలేరు, సూర్యాపేట ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయినా, కొత్తగా మిర్యాలగూడ, కోదాడలో విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో ప్రాతినిధ్యం ఉం డగా, ఈసారి అది ఒక ఎంపీ, ఐదు అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది. అయినా, తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలే అని కాంగ్రెస్‌వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 జిల్లా నుంచి గెలిచిన ఐదుగురు నేతల్లో ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ముగ్గురూ సీనియర్లే. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలూ సీఎల్పీ నేత రేసులో ఉన్నారన్నదే తాజావార్త. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రిగా రికార్డు టైమ్ పనిచేసిన కుందూరు జానారెడ్డి సీఎల్పీ రేసులో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రానికి కాంగ్రెస్‌లో సీఎం పదవి రేసులోనూ ఉన్న  జానా  ఇప్పుడు సీఎల్పీపై దృష్టి పెట్టినట్లు పార్గీవర్గాల సమాచారం. వరుసగా నాలుగో, మొత్తంగా ఏడోసారి విజయం సాధించిన కుందూరు జానారెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్.
 
 తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పార్టీ తరపున గెలిచిన వారిలో జానారెడ్డి కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న నేతలు ఎవరూ లేరు. తెలంగాణ ఉద్యమంలోనూ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన జానా, పొలిటికల్ జేఏసీ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు. సుదీర్ఘకాలంగా వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించిన జానాకు పాలనానుభవమూ ఎక్కువే. ఈ అనుకూల కారణాలతోనే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ)  పదవి కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులో చివరిదాకా ముందుండిన జానా పేరు వి విధ కారణాలతో పక్కనపెట్టారు. జానా స్థానంలో వరంగల్ జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులాయ్యరు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. దీంతో తనకు సీఎల్పీ నేతగానైనా అవకాశం ఇవ్వాలని జానా కోరుతున్నారని చెబుతున్నారు.
 
 కాగా, మరోవైపు నాలుగోసారి విజయం సాధించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా సీఎల్పీ రేసులో ఉన్నారని అంటున్నారు. తెలంగాణ కోసం తన మంత్రిపదవికి కూడా రాజీనామా చేసినందున, ఆ త్యాగాన్ని గుర్తించేలా సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ తరపున గట్టిగా మాట్లాడగలిగే నైతిక హక్కు కోమటిరెడ్డికే ఉందని, నాలుగుసార్లు గెలవడంతో పాటు, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉండడం వంటి అనుకూల అంశాలను ముందు పెడుతున్నారు.
 ఇక, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా సీఎల్పీ రేసులో ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
 అయితే, ఇప్పటికే ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉన్నందున సీఎల్పీ నేతగా అవకాశం ఇస్తారా అన్నది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఓటమి పాలైన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల స్థానే వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్న ఉత్తమ్‌ను నియమిస్తారన్న ప్రచారమూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే ఆయనకు టీపీసీసీ ప్రెసిడెంటు పదవి దక్కుతుందని అంటున్నారు. అలాంటప్పుడు అటు టీపీసీసీ ప్రెసిడెంట్, ఇటు సీఎల్పీ నేత పదవులు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఇస్తారా..? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఉత్తమ్ యథావిధిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగితే, జిల్లాకు చెందిన జానా, కోమటిరెడ్డిలు సీఎల్పీ నేత పదవి కోస గట్టి పోటీదారులు అవుతారని విశ్లేషిస్తున్నారు.
 

Advertisement
Advertisement