ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఆగడాలకు చెక్ | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఆగడాలకు చెక్

Published Fri, Aug 22 2014 3:08 AM

ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఆగడాలకు చెక్ - Sakshi

నల్లగొండ : ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఆగడాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా కట్టుదిట్టమైన నిబంధనలు జారీ చేసింది. ఇప్పటికే యూనివర్సిటీ, జేఎన్‌టీయూ నిబంధనల మేరకు కళాశాలల నిర్వహణ లేదని పేర్కొంటూ కొన్ని కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఇచ్చిన విషయం విధితమే. కాగా గుర్తింపు ఉన్న కళాశాలల్లో కూడా నిబంధనలు కట్టుదిట్టం చేశారు. ఇంజి నీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా(‘బీ’ కోటా) లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంది. గతంలో ఎక్కువ ఫీజులు చెల్లించే వారికే యాజమాన్యాలు సీట్లు ఇచ్చేవి. ఇకనుంచి ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు మెరిట్ విద్యార్థులకే యాజమాన్య కోటా లో కూడా సీట్లు కేటాయించాలని నిబంధనలు విధిం చారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా 70 శాతం, యాజ మాన్య కోటా 30శాతంగా నిర్ణయించారు. అయితే యాజమాన్య కోటాలోనే 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాగా నిర్ణయించారు. దీంతో ఇష్టానుసారంగా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
 
 జిల్లాకు తగ్గిన సీట్లు..
 జిల్లాలో ఒక ప్రభుత్వ కళాశాలతోపాటు ఆరు ప్రై వేటు కళాశాలలకు మాత్రమే ఈ ఏడాది గుర్తింపు లభించింది. జిల్లాలో మొత్తం 41 ఇంజినీరింగ్ కళాశాలలకు  ప్రామాణికాల కారణంగా 34 కళాశాలలకు చెక్ పెట్టారు. కాగా ఒక్కో కళాశాలలో కేవలం 400 నుంచి 500వరకు మాత్రమే సీట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే సీట్ల సంఖ్య భారీగా తగ్గింది.
 
 నిబంధనలతో పరేషాన్..
 ప్రభుత్వ నిబంధనలతో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు పరేషాన్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రామాణికాల పేరుతో కళాశాలల గుర్తింపు ఇవ్వకపోవడంతోపాటు యాజమాన్యాల కోటాలోనూ ప్రభుత్వమే జోక్యం చేసుకోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారనుంది. మెరిట్ ఆధారంగా యాజమాన్య కోటాలో సీట్లు భర్తీ చేస్తే ఆర్థికంగా డబ్బు చెల్లించే స్తోమత ఉందో? లేదో? కూడా పరిశీలించాల్సి ఉంది. దీంతో యాజమాన్యానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఎంసెట్‌లో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంది. యాజమాన్య కోటా పేరుతో చివరి ర్యాంకుల వారికి కూడా సీట్లు లభించేవి. కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలతో మెరిట్ విద్యార్థులకు మాత్రమే సీట్లు దక్కనున్నాయి.
 

Advertisement
Advertisement