‘సర్వే’కు షాక్.. | Sakshi
Sakshi News home page

‘సర్వే’కు షాక్..

Published Tue, Aug 19 2014 3:17 AM

Private enumerators skip the survey

సాక్షి, కరీంనగర్ : సామాజిక, ఆర్థిక సర్వేకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తొలినుంచీ సర్వే విధులకు ‘నో’ అంటున్న ప్రైవేట్ ఎన్యూమరేటర్లు కొందరు సోమవారం చివరిక్షణంలో చేతులెత్తేశారు. ఒక్క వేములవాడలోనే శిక్షణ పొందిన 112 మంది ప్రైవేట్ ఎన్యూమరేటర్లు రిపోర్టు చేయలేదు. చేయనివారు జిల్లావ్యాప్తంగా 600 మందికిపైగా ఉన్నారు. శిక్షణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనారోగ్య కారణాలతో విధులు రద్దు చేయించుకున్నారు.

 దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న అధికారులు హుటాహుటీన ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఫోన్లు చేసి సర్వే విధులు కేటాయించారు. రాత్రికి రాత్రే సీనియర్ విద్యార్థులు, నిరుద్యోగులను హాజరుకావాలని సూచించారు. అయితే తమకు ఎలాంటి శిక్షణ, అవగాహన లేకుండా సర్వే ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. సర్వే ముందురోజే రిపోర్టు చేసి న ఎన్యూమరేటర్లకు జిల్లాలో పలుచోట్ల ఇబ్బందులు తప్పలేదు.

ఎంపి క చేసిన సిబ్బంది సోమవారం ఆయా పట్టణాలు.. మండలాలు.. గ్రామాల్లో రిపోర్టు చేశారు. అధికారులు ఒక్కో ఎన్యూమరేటర్‌కు 24 ఇళ్ల నుంచి 30 ఇళ్ల వరకు కేటాయించారు. ముందస్తుగానే సర్వేఫారాలు అందించాల్సి ఉన్నా.. కొన్నిచోట్ల మంగళవారం ఉదయమే అందిస్తామని అధికారులు చెప్పారు. తీరా సమయానికి ఫారాలు తక్కువ పడితే పరిస్థితి ఏంటని ఎన్యుమరేటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే హుస్నాబాద్ మండలంలో 150 ఫారాలు, మెట్‌పల్లిలో 900, తిమ్మాపూర్ 200 ఫారాలు తక్కువగా వచ్చాయని మండల సమన్వయ కో-ఆర్డినేటర్లు సోమవారం వీడియో కాన్ఫరెన్సులో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రామడుగు మండలం వెదిరలో ఫారాలు అందించలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ సర్వేఫారాలు తక్కువ పడ్డాయి. సిరిసిల్ల పట్టణంలో స్టేషనరీ అందలేదు. ఉదయం ఐదు గంటలలోపు ఆయా ప్రాంతాలకు ఫారాలు పంపిణీ చేస్తామని హామీఇచ్చారు.

 ఎన్యూమరేటర్లపై దాడి..
 సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌లో ఎన్యుమరేటర్లు ప్రవీణ్, సాయిలపైతాగుబోతులు దాడిచేశారు. ఎందుకొచ్చార్రా.. అంటూ చేయి చేసుకున్నారు.  సర్వే చేస్తున్న సమయంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఎలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. సర్వే నిర్వహణలో టీఏ, డీఏ చెల్లించబోమని ప్రభుత్వం ముందే చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్పని పరిస్థితిలో విధులు నిర్వర్తించేందుకు ముందుకొచ్చి నా.. ప్రైవేట్ సిబ్బంది అయిష్టత చూపుతున్నారు. సర్వేను విజయవంతం చేసేందుకు జిల్లాయంత్రాంగం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తోంది. సిబ్బందీ చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement
Advertisement