వీసీ గారూ.. వర్సిటీని చూడరూ..! | Sakshi
Sakshi News home page

వీసీ గారూ.. వర్సిటీని చూడరూ..!

Published Thu, Sep 18 2014 2:45 AM

problems are there in telangana university

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ రాష్ట్రమొచ్చినా తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు మాత్రం తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిత్యం ఏదో ఓ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నూతన కోర్సులు, కొత్త భవనలంటూ సంబురపడటమే తప్పా విద్యార్థుల ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. రెండు నెలల కిందటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు జిల్లా ఎమ్మెల్యేలు ప్రారంభించిన భవన నిర్మాణ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, లా కళాశాలల భవనాలతో పాటు మెయిన్ గేట్(ఆర్చ్) నిర్మాణ పనులు నత్తకే నడక నేర్పేలా సాగుతున్నాయి. అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ తన పదవీకాలం ముగుస్తుందన్న ఒకే కారణంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలనే కాంక్షతో నిర్మాణ పనులు పూర్తి కాక ముందే మంత్రులను పిలిపించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

దీనిపై విద్యార్థులు, వర్సిటీ వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ప్రారంభోత్సవాలకు హాజరైన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం వీసీ తీరుపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకుండానే తమను ఎందుకు ఆహ్వానించారని వీసీని తప్పుపట్టిన విషయం తెలిసిందే. పనులు పూర్తయిన తర్వాతే ప్రారంభోత్సవాలు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా అప్పటి వీసీ పట్టించుకోకుండా ప్రారంభోత్సవం నిర్విహ ంచారు.

 ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
 జూన్ 27న ప్రారంభోత్సవాలు జరిగినా నేటికి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల భవన నిర్మాణ పనులు, మెయిన్ గేట్ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. లా భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకముందే అందులో తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు వెంటనే పూర్తిచేయాలని సంబంధిత కోర్సుల విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టి.. నిరసన సైతం తెలిపారు.

 వర్సిటీ ముఖం చూడని వీసీ
 గత వీసీ అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నాయి. ఇన్‌చార్జి వీసీగా శైలజా రామయ్యర్ బాధ్యతలు చేపట్టారు. కానీ ఒక్కసారి కూడా వర్సిటీని సందర్శించలేదు. పాలనకు సం బంధించి ఇక్కడి అధికారులే హైదరాబాద్ వెళ్లి పనులు చేయించుకు వస్తున్నారు. ఉన్నతాధికారు లు దృష్టిసారించక పోవడంతో నెలల తరబడి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఇన్‌చార్జి వీసీ వర్సిటీపై దృష్టిసారిం చాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement
Advertisement