‘ఎన్నెస్పీ’ స్పీడు | Sakshi
Sakshi News home page

‘ఎన్నెస్పీ’ స్పీడు

Published Sat, Nov 22 2014 3:15 AM

process of selling the land of nsp is speed

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర నడిబొడ్డున గల ఎన్నెస్పీ భూముల విక్రయ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నెల రోజుల క్రితం ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీలో గల భూములను విక్రయించాలని భావించిన అధికారులు దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఈ భూములను ఏ విధంగా ఎవరికి విక్రయించాలనే అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కానప్పటికీ ఎన్నెస్పీ అధికారులు మాత్రం క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేసి, భూముల విక్రయానికి అవసరమైన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.

 ఎన్నెస్పీ క్యాంప్‌లో ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ టైపు వరకు గల దాదాపు 450 క్వార్టర్లలో ఇప్పటి వరకు ఎవరెవరు నివసిస్తున్నారు.. ఎవ రి పేరుతో క్వార్టర్ కేటాయించారు.. అందులో నడుస్తున్న సేవా సంస్థలు, నివసిస్తున్న ప్రజాప్రతినిధులు.. వారు చెల్లించాల్సిన అద్దె బకాయిలు వంటి పూర్తి వివరాలను ఎన్నెస్పీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు క్వార్టర్లు కేటాయించారని, వారు సక్రమంగానే అద్దె చెల్లిస్తున్నందున పెద్దగా బకాయిలు లేవని నివేదికలో పేర్కొన్నారు.

 ప్రభుత్వం ఎన్నెస్పీ భూముల విక్రయానికి నిర్ణయం తీసుకుంటే.. ప్రస్తుతం క్వార్టర్లలో ఉన్న వారికే తొలి ప్రాధాన్యం దక్కేలా నివేదిక రూపొందించినట్లు ఉందని కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, మరికొందరు ఎన్నెస్పీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రిటైర్డ్ అధికారుల ఆధీనంలో న్యూ క్యాంప్ కాలనీలో 11 ‘సి’ టైపు క్వార్టర్లు, 71 ‘డి’ టైపు క్వార్టర్లు, 77 ‘ఇ’ టైపు క్వార్టర్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఓల్డ్ క్యాంప్ కాలనీలో సైతం టైప్‌ల వారీగా రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, రాజకీయ నేతలు ఎవరెవరు ఉంటున్నది సమగ్రంగా వివరించారు.

అయితే రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ భూములను విక్రయిస్తే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారా.. లేదా అనే అంశం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తేల్చాల్సి ఉంది. ఈ కాలనీలో 7 ప్రైవేట్‌సంస్థలు, 22 మంది ప్రైవేట్ వ్యక్తులు, నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, 37 మంది ఇతర శాఖలకు సంబంధించిన వారు, 77 మంది ఎన్నెస్పీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ఉన్న క్వార్టర్లలో 54 పూర్తిగా శిథిలమైనట్లు నివేదించిన అధికారులు దాదాపు 237 క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కాగా, ఎన్నెస్పీ భూములను విక్రయించడం దాదాపు ఖాయమన్న భావన కలిగించేలా ఈ నివేదిక ఉండటంతో ఆ భూములను సేవా రూపంలో కాజేసేందుకు బడాబాబుల అండదండలున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Advertisement
Advertisement