పని చేస్తే రివార్డులు.. లేదంటే చర్యలు! | Sakshi
Sakshi News home page

పని చేస్తే రివార్డులు.. లేదంటే చర్యలు!

Published Mon, Apr 3 2017 3:18 AM

పని చేస్తే రివార్డులు.. లేదంటే చర్యలు!

డీఈవోల సమావేశంలో కడియం
నేటి నుంచి 13 వరకు బడిబాట


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే బడిబాటలో టీచర్లు బాగా పని చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. బాగా పని చేసిన వారిని సన్మానిస్తామని, పనిచేయని వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.

 గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని, ఇప్పుడు ప్రైవేట్‌ పాఠశాలల కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్న తీరును బడిబాటలో వివరించాలని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం, ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆదివారం హైదరాబాద్‌లో డీఈవోలతో సమీక్ష నిర్వహించారు. బడిబాటలో ప్రజా ప్రతినిధులను, అధికారులను భాగస్వాములను చేయాల ని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా, నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డీఈవోలు తమ పరిధిలోని స్కూళ్లను స్వయంగా తనిఖీ చేసి, సమస్యలపై ఈనెల 20లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈనెల 15 లోగా విద్యార్థులందరికీ పుస్తకాలు, జూన్‌ 15వ తేదీ లోగా యూనిఫారాలు అందజేయాలని, ఇందుకోసం అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

విద్యా వలంటీర్లను నియమించండి
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరో 6నెలలు పడుతుందని, అప్పటివరకు వేచిచూడకుండా జూన్‌లోగా స్కూళ్లలో విద్యా వలంటీర్లను నియమించాల ని అధికారులను ఆదేశించారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ వచ్చాక పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. అన్ని కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో డిజిటల్‌ తరగతు లను ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు, వంట వారి వేతనాలను ప్రతి నెలా 10 లోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాగ్‌ ఇచ్చిన నివేదిక మేరకు ఐదేళ్ల నుంచి 25 ఏళ్లలోపు వయస్సున్న వారి అక్ష రాస్యత జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువ ఉందని, ఇది సంతోషకర విషయ మని చెప్పారు.

 విద్యా ర్థుల నమోదు, కొనసాగింపులోనూ రాష్ట్రం మంచి స్థానం లో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగవుతు న్నాయని కూడా కాగ్‌ పేర్కొన్నట్లు వివరించారు. గురుకు లాల్లో పరిస్థితి ఇంకా మెరుగు పడాల్సిఉందన్నారు. నిర్దేశించిన కార్యక్రమాల పురోగతిపై మేలో మరోసారి డీఈవోలతో సమావేశం నిర్వహిస్తానన్నారు.

 వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి అన్ని చోట్లా... బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటి సంఖ్య పెంచాలని ఇంజనీ రింగ్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement