ప్రాజెక్టుల పూర్తికి లక్ష కోట్లు! | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పూర్తికి లక్ష కోట్లు!

Published Mon, May 12 2014 12:55 AM

ప్రాజెక్టుల పూర్తికి లక్ష కోట్లు! - Sakshi

తెలంగాణలో వచ్చే ఐదేళ్లకు అంచనా   
నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు ఇక్కడే ఎక్కువ
ఒక్క ప్రాణహిత - చేవెళ్లకే రూ.50 వేల కోట్లు అవసరం!
దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ పనులు ఇంకా మొదలే కాలేదు

 
సాక్షి, హైదరాబాద్:  తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయాలంటే ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున మొత్తం సుమారు లక్ష కోట్ల రూపాయలు అవసరమని అంచనా. పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల్లో ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు దేవాదుల, కంతనపల్లి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుల్లో ఆరు మాసాల నుంచి సంవత్సరంలోపు పూర్తయ్యేవే ఎక్కువగా ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల వంటి భారీ ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలోగా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే పైన పేర్కొన్నట్టు ఏటా బడ్జెట్‌లో భారీ కేటాయింపుల్ని చేస్తేనే ఇవి పూర్తవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణలోనే ఎక్కువ ప్రాజెక్టులు
రాష్ర్టంలో జలయజ్ఞం కింద 86 ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో 44 భారీ ప్రాజెక్టులు ఉండగా, 30 మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితోపాటు 4 ఫ్లడ్‌బ్యాంకులు, 8 ఆధునీకరణ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 16 ప్రాజెక్టులు పూర్తి కాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.74 వేల కోట్లు వ్యయం చేశారు. పూర్తరుున ప్రాజెక్టులతో పాటు, పాక్షికంగా పూర్తయిన మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతిని కల్పించారు. అరుుతే ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు వాస్తవానికి 2013-14 వరకే పూర్తి కావాల్సి ఉంది. కానీ గత నాలుగేళ్లుగా పనులు జరగకపోవడంతో ఈ గడువును మరో నాలుగేళ్ల పాటు 2018 వరకు పొడిగించారు. ఈ కారణంగా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరగనుంది. తొలుత రూ.40 వేల కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం వచ్చే నాలుగేళ్లలో మరో రూ.10 వేల కోట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 50 వేల కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు పనులు అసలు మొదలే కాలేదు.

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గతంలో తెలంగాణవాదులు వ్యతిరేకించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతున్నందున వచ్చే ప్రభుత్వ వైఖరిపై ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టును చేపడితే దీని అంచనా వ్యయం కూడా రూ.20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇక కంతనపల్లి టెండర్‌ను ఇటీవలే ఖరారు చేశారు. దీని బ్యారేజీ నిర్మాణానికి రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. రెండవ దశలో ఏర్పాటు చేసే లిప్టులు, కాల్వల కోసం మరో రూ.10 వేల కోట్లు అవసరం.

వీటితో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న దేవాదుల, ఎల్లంపల్లి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టుల కోసం మరో రూ. 10 వేల కోట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల సంగతి ఇలావుంటే.. తెలంగాణలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టాలనే డిమాండ్ ఉంది. ఇందులో భారీ పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా ఉంది.

జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని లిప్టు చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యం. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రూ.7 కోట్లు కూడా విడుదల చేశారు. ఇక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రాజెక్టు మొదలు పెట్టే సమయానికి ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement