వ్యవసాయశాఖలో పదోన్నతుల వివాదం | Sakshi
Sakshi News home page

వ్యవసాయశాఖలో పదోన్నతుల వివాదం

Published Sun, Nov 25 2018 3:34 AM

Promotions dispute In the agricultural department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయశాఖలో పదోన్నతుల వివాదం రాజుకుంది. ఒకవైపు ఎన్నికల హడావుడి కొనసాగుతుంటే, మరోవైపు శాసనసభ రద్దుకు ఒక రోజు ముందు వ్యవసాయశాఖ అక్రమంగా ఒక జీవో తీసుకొచ్చి వివాదానికి తెరతీసిందంటూ ఆ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. కేవలం ఒకేషనల్‌ డిగ్రీతో మండల వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)గా పనిచేసే పలువురికి మండల వ్యవసాయాధికారులు (ఏవో)గా పదోన్నతి కల్పిస్తూ సెప్టెంబర్‌ 5న జీవో ఇచ్చారని, దేశంలో ఎక్కడా ఇలా లేదంటూ వ్యవసాయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై అటు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ కొందరు ఉద్యమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే జాతీయస్థాయిలోనూ దీనిపై కొందరు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఐకార్‌ గుర్తింపు ఉంటేనే...
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) గుర్తింపు లేని ఒకేషనల్‌ డిగ్రీతో కొందరు ఏఈవోలుగా పనిచేస్తున్నారు. వారికి ఏఈవోలుగా పనిచేసేందుకు అవకాశమున్నా, ఏవోగా పదోన్నతి పొందాలంటే ఐకార్‌ గుర్తింపు పొందిన ఏదో ఒక కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివి ఉండాలన్న నిబంధన ఉందంటున్నారు. అందుకోసం వారికి ప్రత్యేక అనుమతి ఇచ్చి అర్హత కల్పించాక పదోన్నతి కల్పించాలని అంటున్నారు. అలా కాకుండా రాష్ట్రంలో దాదాపు 27 మంది ఏఈవోలకు ఒకేషనల్‌ కోర్సుతోనే పదోన్నతి కల్పించేలా వ్యవసాయశాఖ జీవో 95ను తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. అందుకో సం ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తి కుమారు డు, అతని వ్యక్తిగత కార్యదర్శి రూ. 3 కోట్ల వరకు బేరం పెట్టి ఈ జీవో తీసు కొచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారికి పదోన్నతులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపాల ని జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)కు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

వాస్తవ అర్హులు 850 మంది
వ్యవసాయశాఖలో అర్హత కలిగిన 850 మంది ఉండగా కొందరి కోసమే వేగంగా పావులు కదుపుతుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఐకార్‌ గుర్తింపు లేని ఒకేషనల్‌ కోర్సులకు పదోన్నతులు ఇవ్వడం సబబు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తాము ఐకార్‌కు ఫిర్యాదు చేస్తామని కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, వ్యవసాయశాఖ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఒకేషనల్‌ కోర్సు చేసి ఏఈవోలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలంటే, ఐకార్‌ గుర్తింపు ఉండేలా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి కానీ, ఇలా దొడ్డిదారిన పదోన్నతులు కట్టబెట్టడంపై సరికాదని వారంటున్నారు. ఎన్నికలప్పుడు ఎవరూ పట్టించుకోరన్న భావనతో ఇలా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని వారు చెబుతున్నారు. 

Advertisement
Advertisement