ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేయాలి | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేయాలి

Published Mon, Aug 29 2016 2:17 AM

ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేయాలి - Sakshi

ప్రొఫెసర్ కోదండరాం
♦ జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి
♦ త్వరలో అన్ని జిల్లాల్లో సదస్సులు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేయాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగిందని భావించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం నాచారంలో ‘తెలంగాణ - అభివృద్ధి నమూనా - టీజేఏసీ ఆలోచన’ అనే అంశంపై జరిగిన సదస్సుకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మార్పులు అవసరమే కాని.. అవి ప్రజాభిప్రాయం మేరకే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ఈ అంశంపై అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సదస్సులో తెలంగాణ అభివృద్ధి నమూనాపై రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, నీటి వనరుల వినియోగం అంశంపై బొజ్జ భిక్షం, కృష్ణా జలాల వినియోగంపై ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, సాగునీటి వ్యవస్థపై కె.రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఉపాధి, ఉద్యోగరంగాలు అనే అంశంపై గిరిజాల రవీందర్, జోనల్ వ్యవస్థ రద్దు అనే అంశంపై సురేశ్ మాట్లాడారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని, అయితే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కలిగేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. జోనల్ వ్యవస్థ రద్దు అనే అంశంపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, జిల్లాల పునర్‌విభజన,  ఉద్యోగ అవకాశాలపై విస్తృత జర్చ జరిపామని అన్నారు. గత ఏడాది పంటలు ఎండిపోయి నష్ట పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని, ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి, కరువు పరిస్థితులను అంచనా వేయడానికి  ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు.

కృష్ణా జలాల వినియోగంపై మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సదస్సులో జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, కె.రఘు, ప్రహ్లాద్, వెంకట్‌రెడ్డి, జి.రవీందర్, ప్రొఫెసర్ పురుషోత్తం, ఇతర నేతలు ముత్తయ్య, రమేశ్, వీఎస్ మల్లికార్జున్, ఖాజా మోయినుద్దీన్, ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణ, చల్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, డాక్టర్ పాపారావు, ప్రకాశ్, విజయ్‌కుమార్, బాబన్న, వెంకటేశ్, ధర్మరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement