గంజాయి ఘాటు | Sakshi
Sakshi News home page

గంజాయి ఘాటు

Published Mon, Aug 11 2014 12:27 AM

pungent of marijuana

ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని ఖానాపూర్, బజార్‌హత్నూర్, భూతాయి, డెడ్ర, సిర్పూర్, కడెం, చెన్నూర్, నిర్మల్, భైంసాతోపాటు ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది గంజాయిని అంతరపంటగా సాగు చేస్తున్నారు. పత్తి, తొగరి పంటలు సాగు చేసినప్పుడు మధ్యలో గంజాయి సాగు చేస్తున్నారు. చేలల్లో బంతిపూల మొక్కలు కూడా పెంచడంతో గంజాయి ఆకు కూడా అదే ఆకారం, రంగులో ఉండడంతో పెద్దగా తేడా కనిపించదు. ఎవరైనా బయట నుంచి చూస్తే ఇతర ఏవో పంటలు సాగు చేస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో ఉన్న గంజాయి కనిపించదు. గంజాయి ఆకు పూర్తిగా ఎండిపోతే వాసన వస్తుంది. ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా జరిగితే చేనులో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసిపోతుంది. దీంతో పూర్తిగా ఎండిపోకముందే ఆకు తెంపుతున్నారు.   

 బస్సులు, రైళ్లలో ఇతర రాష్ట్రాలకు..
 జిల్లాలో సాగైన గంజాయికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి గంజాయిని ఏజెంట్లు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు బెంగళూరుకు రవాణా చేస్తున్నారు. గంజాయి సాగు చేసిన యాజమాని నుంచి జిల్లాలోని కొంతమంది మధ్యవర్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఏజెంట్లు గంజాయిని సంచుల్లో నింపి బస్సులు, రైళ్లలో తరలిస్తుంటారు. గంజాయి వాసన రాకుండా ఉండేందుకు సెంటు చల్లుతారు. ఎక్కడైనా పోలీసులకు పట్టుబడితే ఆ బ్యాగులు తమవేని చెప్పకుండా ఏజెంట్లు ముందే ఒప్పందం కుదుర్చుకుంటారు. జిల్లాలో కిలో గంజాయి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ధర పలుకుతోంది. డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో అక్కడి వ్యాపారులు కిలో రూ.5వేల నుంచి రూ.15వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయి సాగు చేసిన వారితోపాటు ఏజెంట్లు, వ్యాపారులకు లాభసాటిగా మారడంతో దందా జోరుగా సాగుతోంది.

 12 కేసులు నమోదు
 జిల్లా నుంచి గంజాయి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. ఈ ఏడాది జిల్లాలో రూ.15 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 12 కేసులు నమోదు చేశారు. గత ఏడాది 23 కేసుల్లో సుమారు 6 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా పట్టుబడిన కేసులే అధికంగా ఉన్నాయి. ఈ నెల 3న బజార్‌హత్నూర్ మండలం భూతాయి-బి గ్రామ అటవీ ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో గతంలో ఐచర్‌లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.

ఇందులో రూ.1.30 కోట్ల విలువైన గంజాయి లభించింది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు చేస్తూ.. ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నా పోలీసులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన గంజాయిపై కేసులు నమోదు చేయడమే గానీ.. ఎక్కడ సాగువుతుంది, ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు తరలిస్తున్నారు, ఈ వ్యాపారం వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేసిన దాఖలాలు లేవు. దీంతో గంజాయి సాగు, వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి.

 పట్టణాల్లోకి ప్యాకెట్లు..
 జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖానాపూర్ పట్టణాలకు ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నట్లు సమాచారం. ప్యాకెట్లను కాలనీల్లోని దుకాణాలు, కొంతమంది ఇళ్లలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ప్యాకెటు రూ.50 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. వీటితోపాటు రూ.20కి కాగితాల్లో పొట్లం కట్టి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. యువత, మధ్య వయస్కులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిగరేట్‌లోని పొగాకును తీసి వేసి గంజాయితో నింపి తాగుతున్నారు. మత్తులో మునిగి తేలుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement