నెహ్రూను మించిన ప్రధాని పీవీ

24 Dec, 2019 04:32 IST|Sakshi

ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలతో దేశగతి మారిపోయింది: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ మాజీ వీసీ

అంకితభావంతో పనిచేశారు: జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన ప్రధాని పీవీ నరసింహారావు అని బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ వీసీ ఆర్‌వీఆర్‌ చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమం సందర్భంగా పీవీకి సన్నిహితుడిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడే కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన లీడర్‌షిప్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా కాన్ఫరెన్స్‌లో పీవీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుందని, ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు కాన్ఫరెన్స్‌ను మరో రోజు పొడిగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ.. పీవీకి అనుకోకుండా పదవులు వచ్చినా.. అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పీవీని ప్రధానిగా కాంగ్రెస్‌ ప్రకటించే సమయంలో తాను ఢిలీల్లో ఉన్నానని, ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పగా, తెలుగు వ్యక్తి ప్రధాని కావడంపై ఆయన ఎంతో సంతోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన మనవడు ఎన్వీ సుభాష్‌ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు