మండలిలో ప్రశ్నోత్తరాలు | Sakshi
Sakshi News home page

మండలిలో ప్రశ్నోత్తరాలు

Published Fri, Dec 30 2016 12:51 AM

మండలిలో ప్రశ్నోత్తరాలు - Sakshi

ప్రభుత్వ స్కూళ్లలో వసతులకు 235 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం, ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడం, ఆంగ్ల మాధ్యమంలో చదివించాలన్న తల్లిదండ్రుల ఆలోచన వల్ల ఏటా లక్షన్నర మంది పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్‌ కట్టి, మెయిం టెనెన్స్‌ కింద రూ. 60 కోట్ల చొప్పున, హైస్కూళ్లకు రూ. లక్ష, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 50 వేల చొప్పున నిధులిస్తున్నామన్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేశామని ఈ అంశంపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, సభ్యులు పూల రవీందర్, రామచంద్రారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్, పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు.  

టీచర్ల పనితీరు బాగోలేదు: షబ్బీర్‌
పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, స్కూళ్లకు రాకుండానే సంతకాలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం ఉప్పల్‌వాయిలో ఓ హెడ్‌మాస్టర్‌ 29 రోజులు పాఠశాలకు రాకున్నా వచ్చినట్లుగా సంతకాలు పెట్టారని.. ఇలా అనేక పాఠశాలల్లో జరుగుతోందన్నారు. ఉపాధ్యాయుల పనితీరు వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం.. దేశంలోనే చివరి స్థానంలో ఉందని, దాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

త్వరలో విత్తన చట్టం: పోచారం
నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు త్వరలోనే విత్తన చట్టాన్ని తీసుకురానున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ మిరప విత్తన విక్రయదారులపై ఇప్పటికే కఠినంగా వ్యవ హరిస్తున్నామని, పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాల కారణంగా 8,171 మంది రైతులు నష్టపోయారని, 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దీనికి కారణమైన 130 మంది విత్తన డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేసి 17 క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని, 2,556 మంది రైతులకు రూ. 1.57 కోట్ల నష్ట పరిహారం చెల్లించామన్నారు.

హైదరాబాద్‌లో కొత్త నీటి పైప్‌లైన్లు: కేటీఆర్‌
కృష్ణా, గోదావరి నదుల నుంచి తాగునీటి సరఫరా పెంచేందుకు హైదరాబాద్‌లో కొత్త నీటి పైప్‌లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నీటిసరఫరా సేవలను విస్తరించేందుకు అల్వాల్, కాప్రా, ఉప్పల్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కూకట్‌æపల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు సర్కిళ్లలో ఫీడర్‌ మెయిన్‌తో పాటు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయన్నారు. 2018 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.

విడిగా నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటు
రాష్ట్రంలో నాన్‌వెజ్‌ మార్కెట్‌ను విడిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు  మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో చేపలకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా చేపల పెంపకం, వాటిని మార్కెట్‌ చేయడానికి తగిన ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement