రబీకి రాం..రాం | Sakshi
Sakshi News home page

రబీకి రాం..రాం

Published Thu, Nov 20 2014 3:35 AM

రబీకి రాం..రాం - Sakshi

రబీలో వ్యవసాయ రంగానికి కరెంటు ఇవ్వడం సాధ్యం కాదని, ఆరుతడి పంటలే వేసుకోవాలని స్వయానా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల స్పష్టం చేశారు. అలాగే జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీలో నీళ్లు లేవని, ఉన్న నీళ్లు తాగేందుకే సరిపోతాయని, రబీలో నీటి విడుదల ఉండదని ప్రాజెక్టు సీఈ శంకర్ అంతకుముందే తేల్చిచెప్పారు. దీంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది.
 
 కరీంనగర్ అగ్రికల్చర్ : ఈ ఏడాది అన్నదాతలను ‘కాలం' వెక్కిరించింది. వర్షాభావం, కరెంటు కోతలతో ఖరీఫ్‌లో అపారనష్టాన్ని మూటగట్టుకున్న రైతన్నలకు ఇప్పుడు రబీ రంది పట్టుకుంది. ఖరీఫ్‌లో చేసిన అప్పులను తీర్చుకుందామని రబీపై గంపెడాశలు పెట్టుకోగా సాగునీటి కొరత, కరెంటు కోతల రూపంలో చుక్కెదురైంది. సాధారణంగా రబీలో ఎస్సారెస్పీ, బోర్లు, బావులపై ఆధారపడి రైతులు సాగు పంటలు చేస్తుంటారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండుముఖం పట్టింది.

90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 22.41 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది కేవలం తాగునీటి అవసరాలకే సరిపోనుంది. ఇక సాగు అవసరాలకు విడుదల చేసే అవకాశమే ఉండదు. 24 టీఎంసీల సామర్థ్యమున్న దిగువమానేరు జలాశయంలో బుధవారం వరకు 7.051 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇందులో రెండు టీఎంసీలు డెడ్‌స్టోరేజీ. మిగిలిన ఐదు టీఎంసీలను కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, వేములవాడ, సిరిసిల్లకు తాగునీటి కోసం వినియోగించనున్నారు.

ప్రస్తుతం బావుల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే రెండుమీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా 3.40 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లున్నాయి. వీటికి రోజుకు 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ కేటాయింపులు లేక కోతలు తీవ్రమయ్యాయి. పంటల విస్తీర్ణం పెరగకముందే లోటు పెరగడం కలవరపెడుతోంది.

 అప్పుల ఊబిలో ఆత్మహత్యలు
ఖరీఫ్‌లో పంట దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో రైతుల నెత్తిన పెట్టుబడుల భారం పడిం ది. అప్పటికే అప్పులపాలైన రైతులు మరింత ఊబిలో కూరుకుపోయినట్లు అయ్యింది. ఖరీఫ్ లో పొలం దున్నడం, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కలిపి ఎకరాకు రూ.18- 20 వేల వరకు పెట్టుబడులు పెట్టారు.

వర్షాభావం, కరెంటు కోతలతో పంటలన్నీ ఎండిపోయి ఆ భారమంతా మీదపడింది. ప్రస్తుతం రబీలో పెట్టుబడుల కోసం అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే పంటనష్టం, అప్పులబాధతో జిల్లాలో 70 మందికిపైగా రైతు లు ఆత్మహత్య చేసుకోవడం కలవరపరుస్తోంది.

 ట్రాన్స్‌‘ఫార్మర్ల’ కష్టాలు
 కరెంటు కోతలతో సతమతమవుతుంటే ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. లోవోల్టేజీ, ఓవర్‌లోడ్ కారణంగా జిల్లాలో రోజుకు సుమారు వం ద ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో వాటి ని రైతులే స్వయంగా మరమ్మతు కేంద్రాలకు తరలిస్తున్నారు.

అప్పటికే కేంద్రాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పలుతెప్పలుగా ఉండడంతో మరమ్మతుకు 15రోజులు ఆగాల్సి వస్తోంది. ఆలోపు పంటలన్నీ ఎండిపోతే దశకు చేరుకుంటున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం పడకుండా.. అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని ఫిర్యాదు చేస్తే ట్రాన్స్‌కో సిబ్బంది స్పందించే తీరు కూడా అంతంతమాత్రమే.
 
 20శాతమే సాగు..
 రబీలో 6.87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 4.37 లక్షల ఎకరాల్లో వరి, 1.38 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.11లక్షల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తారని నివేదిక రూపొందించారు. కానీ.. రబీ ప్రారంభమై నెల గడిచినా ఇప్పటివరకు 20 శాతం మాత్రమే సాగులోకొచ్చింది.
 
 రబీలో పంటల సాగు ఇలా..(హెక్టార్లలో)
 పంట              సాధారణ సాగు            సాగయ్యింది
 వరి                        155338                       -
 మొక్కజొన్న             44984                 11226
 పెసర్లు                         3765                  2413
 శనగలు                       2082                  1274
 బబ్బెర్లు                        4119                    684
 వేరుశనగ                   10384                 4520
 పొద్దుతిరుగుడు                430                     25
 
 ఖరీఫ్, రబీ పంట రుణాలు
 లక్ష్యం.. రూ.2300 కోట్లు
 ఇచ్చింది రూ.1280 కోట్లు
 
వర్షపాతం ఇలా..
జూన్ నుంచి ఇప్పటివరకు 900 మిల్లీలీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ 584.6 మిల్లీలీటర్లకు మించలేదు.
 
మెట్‌పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్, కాటారం, కమాన్‌పూర్‌లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 50 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
 
బోయినిపల్లి మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 47 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని జిల్లా యంత్రాంగం సర్కారు ఇటీవలే ప్రతిపాదనలు పంపింది. అందులో ఎన్ని మండలాలను కరువుగా ప్రభుత్వం గుర్తిస్తుందో అనే ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement