‘రైతు బంధు’ ఆలస్యం! | Sakshi
Sakshi News home page

‘రైతు బంధు’ ఆలస్యం!

Published Wed, Apr 11 2018 10:09 AM

Raithu Bandhu Scheme Delayed - Sakshi

ఇప్పటివరకు రెవెన్యూరికార్డుల సమాచారంప్రభుత్వానికి చేరని కారణంగానిర్ణీత వ్యవధిలో చెక్కుల పంపిణీ ఉండకపోవచ్చనితెలుస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:‘రైతు బంధు’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూ రికార్డుల అప్‌డేషన్‌ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడంతో చెక్కుల పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎకరాకు రూ.4వేల చొప్పున రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి దశలవారీగా గ్రామాల్లో రైతు బంధు పథకం వర్తింపజేయాలని సంకల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన పర్వానికి తెరపడిన అనంతరం ఆ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారానికి అనుగుణంగా రైతులకు చెక్కులను పంపిణీ చేయాలని భావించింది. అయితే, రికార్డుల సమాచారం ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరకపోవడంతో చెక్కుల ముద్రణ జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

జిల్లావ్యాప్తంగా దాదాపు 7.10 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన రెవెన్యూయంత్రాంగం.. ఈమేరకు 2,87,768 పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణకు రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డుల ప్రక్రియ పూర్తికాగానే సేకరించిన సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాల్సివుంటుంది. ఈ సమాచారాన్ని సీసీఎల్‌ఏకు నివేదించి.. అక్కడినుంచి ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌)లో మరోసారి వివరాలను సరిచూసుకొని వాటిని బ్యాంకులకు పంపించాల్సివుంటుంది. ఈ మేరకు నిర్దేశించిన బ్యాంకులు చెక్కులు ముద్రించాలి. ప్రక్రియ ఇలా కొనసాగాల్సివుండగా మంగళవారం నాటికి జిల్లాకు సంబంధించిన సమాచారం సీసీఎల్‌ఏకు చేరలేదు. దీంతో చెక్కుల పంపిణీపై ప్రభావం పడుతోందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

ఈక్రతువు నెల 15వ తేదీలోపు పూర్తయితే తప్ప ఖరారు చేసిన ముహూర్తం(19వ తేదీ) రోజున చెక్కుల పంపిణీ జరిగే అవకాశం లేదని అంటున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీల్లో మొదటి విడత చెక్కుల పరిశీలనకు రావాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, మన జిల్లాకు ఈ పిలుపు రాకపోవడం.. ఇప్పటివరకు రెవెన్యూ రికార్డుల సమాచారం ప్రభుత్వానికి చేరలేదనే సమాచారంతో నిర్ణీత వ్యవధిలో చెక్కుల పంపిణీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే నమోదైనా క్షేత్రస్థాయిలో అవి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండడంతో పెట్టుబడి సాయం వర్తింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయేతర భూములను రైతుబంధు పథకం నుంచి మినహాయింపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.

Advertisement
Advertisement