పోరుగడ్డ పెరుమాళ్లసంకీస | Sakshi
Sakshi News home page

పోరుగడ్డ పెరుమాళ్లసంకీస

Published Mon, Sep 1 2014 3:37 AM

Rajakarla atrocities 66 years

  •      రజాకార్ల దురాగతానికి 66 ఏళ్లు
  •      ఊరు తగులబెట్టి పైశాచిక దాడి
  •      నాటి ఘటనలో 21 మంది మృతి
  • డోర్నకల్ : తెలంగాణ సాయుధ పోరులో పెరుమాళ్లసంకీస కీలకపాత్ర పోషించింది. డోర్నకల్ మండలంలోని పెరుమాళ్లసంకీసతోపాటు బూరుగుపాడు, ఉయ్యాలవాడ, వెన్నారం తదితర గ్రామాలకు చెందిన అనేక మంది రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించారు. సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య దళనాయకుడిగా ముందుండి రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడారు.

    తెలంగాణ ప్రాంతం నుంచి రజాకార్లను తరిమికొట్టాలంటూ దళాలతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరిచాడు. ఒక్కో దళంలో 12 మంది సభ్యుల చొప్పున 8 దళాలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో తుమ్మ శేషయ్యతోపాటు ఉద్యమాల్లో పాల్గొంటున్న యువకులను అంతమొందించేందుకు రజాకార్లు కుట్ర పన్నారు. 1948 సెప్టెంబర్ ఒకటో తేదీన రెండొందల మందికి పైగా రజాకార్లు సంకీస గ్రామంపై ఆయుధాలతో దాడి చేసి మారణహోమం సృష్టించారు.

    తుమ్మ శేషయ్య కోసం రజాకార్లు రాగా... ఆ సమయంలో ఆయన లేకపోవడంతో గ్రామస్తులపై దాడి చేసి మట్టుబెట్టారు. గ్రామ నలుమూలల నుంచి లోపలకు ప్రవేశించి  పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. గ్రామ నడిబొడ్డున ఉన్న బందెల దొడ్డి వద్దకు పురుషులను ఈడ్చుకువచ్చి గుండ్రంగా కూర్చోబెట్టి తుపాకులతో అమానుషంగా కాల్చి చంపారు. కాల్పుల్లో చాలా మంది చనిపోగా... కొన ఊపిరితో ఉన్నవారిని వరిగడ్డి కప్పి దహనం చేశారు.

    మహిళలపై మూకుమ్మడిగా అత్యాచారాలకు పాల్పడ్డారు.  నాటి ఈ ఘటనలో మొత్తం 21 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన వృద్ధులు ఆ ఘటనను తల్చుకుని నేటికీ భయంతో వణుకుతున్నారు. ఆ తర్వాత కాలంలో నాటి మృతుల జ్ఞాపకార్థం పెరుమాళ్లసంకీస గ్రామంలో స్మారకస్థూపం ఏర్పాటు చేశారు.  
     
     ఊరు తగులబెట్టారు...
     రజాకార్లు రెండు సార్లు ఊరిని తగులబెట్టారు. మూడు సార్లు దాడులు జరిపారు. నా భర్త నారాయణను రెండు సార్లు జైలులో పెట్టారు. మహిళలపై రజాకార్లు అతికిరాతకంగా దాడులు చేస్తుండడంతో మొక్కజొన్న తోటల్లో దాక్కున్నాం.    
     - శెట్టి వెంకటనర్సమ్మ
     
     పైశాచిక దాడి...
     రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నపుడు నాకు 17 ఏళ్లు. అడవుల్లో ఉన్న దళాలకు అన్ని రకాలుగా సహకరించాను. రజాకార్లు మానవత్వం మరిచి రక్తపాతం సృష్టించారు. పిల్లలు, పెద్దలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని తలా దిక్కు పారిపోయారు.    
     - కొత్త రంగారెడ్డి
     
     నాటి ఉద్యమకారులే స్ఫూర్తి..
     సాయుధపోరులో అనేక మంది ప్రాణాలు కోల్పోయూరు. వారి ఆశయసాధన కోసం పనిచేస్తున్నాం. వారి స్ఫూర్తితో  పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం.
     - శెట్టి వెంకన్న, పెరుమాళ్లసంకీస సర్పంచ్
     

Advertisement

తప్పక చదవండి

Advertisement