రైతు బంధు పై రభస

17 Feb, 2019 11:45 IST|Sakshi
అమర జవాన్లకు నివాళి అర్పిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దున్నేవారికి కాకుండా భూమి ఉన్నవారికే పెట్టుబడి సాయం అందుతోందని జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 20శాతం మంది రైతుల దరికి ఇంకా ‘రైతుబంధు’ చేరలేదని వ్యాఖ్యానించింది. శనివారం చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జెడ్పీ సమావేశంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకంపై వాడీవేడి చర్చ సాగింది. సభ ప్రారంభంకాగానే.. మంచాల, కందుకూరు జెడ్పీటీసీ సభ్యులు మహిపాల్, జంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచి ఉద్దేశంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటికీ, సగం మందికి ఇంకా లబ్ధి చేకూరలేదనే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించిన అధికారపక్ష సభ్యులు.. సాంకేతిక కారణాలతో కొంతమంది ఖాతాలో నగదు జమ కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోకుండా అడ్డగోలుగా మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది.
 
రెవెన్యూతోనే తలనొప్పి.. 
రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల వ్యవహారాన్ని సమావేశం ఆక్షేపించింది. రెవెన్యూ అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పకడ్బందీగా రికార్డులను సరిదిద్దకపోవడం.. ఉద్దేశపూర్వకంగా పాస్‌బుక్కులను జారీచేయకపోవడంతో చాలామంది రైతులకు రైతుబంధు రాకుండా పోయిందని సభ్యులు విమర్శించారు. అభ్యంతరాలులేని భూములకు కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, శంషాబాద్‌ జెడ్పీటీసీ సభ్యుడు సతీష్‌ మాట్లాడుతూ.. రైతుల ఖాతాలో నిధులు జమ కాకున్నా జమ అయినట్లు సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని, ఇలా రైతులను మోసం చేయడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు.

సాంకేతిక సాకులతో రైతుబంధు పథకాన్ని వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. రైతుబంధుతో సంపన్నులకే లబ్ధి చేకూరిందని, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలో ఇంకా నయాపైసా జమ కాలేదని మంచాల జెడ్పీటీసీ సభ్యుడు మహిపాల్‌ అన్నారు. శంకర్‌పల్లి ఎంపీపీ చిన్న నర్సిములు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ సాకుతో ఆరు నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనులు జరగడంలేదని, పాస్‌పుస్తకాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. తాజాగా పాస్‌పుస్తకాలు అందినవారికి త్వరలోనే రైతుబంధు సాయం అందుతుందని, పాత బకాయిలు మాత్రం ఇచ్చే అంశంపై స్పష్టత లేదని మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు.
 
క్షమాపణ చెబుతున్నా.. 
‘అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది. కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం కింద ప్రతి రైతుకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సాంకేతిక కారణాలతో కొంతమందికి ఇంకా సాయం అందలేదు. నగదు పంపిణీలో ఆలస్యమైనందుకు సర్కారు తరుఫున క్షమాపణలు చెబుతున్నా’ అని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు.

మేమే అక్రమార్కులమా? 
మొయినాబాద్‌ మండలంపై మీరు(డీపీఓ) కక్షగట్టారు. 111 జీఓ పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల లేఅవుట్ల జోలికి వెళ్లకుండా మావే కూల్చుతున్నారంటే మీ ఉద్దేశమేమిటో తెలుస్తోంది. ఎమ్మెల్యేతో మీరు మిలాఖత్‌ అయ్యారు. అజీజ్‌నగర్‌లో బడాబాబులు నిర్మించిన విల్లాలను టచ్‌ చేయకుండా.. 200 గజాల స్థలంలో ప్లాట్లు కొన్నవారిని వేధిస్తున్నారు అని మొయినాబాద్‌ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాపచంద్రలింగం తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. హిమాయత్‌సాగర్‌ బొడ్డున హరీష్‌రావు, ఎమ్మెల్యే వివేకానంద నిర్మించిన భవనాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. సభ్యుడి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేధించిన డీపీఓ పద్మజారాణి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం తప్ప వివక్ష పాటిస్తున్నామనడం సరికాదన్నారు. అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నా తొలగిస్తామని, అజీజ్‌నగర్‌ విల్లాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటి జోలికి వెళ్లడం లేదన్నారు.
 
సీనరేజీ సుంకం ఇవ్వరా? 
హైకోర్టు తీర్పు ఇచ్చినా సీనరేజీ సెస్సు ఇవ్వకపోవడం ఏమిటని చేవెళ్ల జెడ్పీటీసీ చింపుల శైలజ ప్రశ్నించారు. 2012–13 నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.520 కోట్లను విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా కౌంటర్‌ దాఖలు చేయాలని భావించడం చూస్తే స్థానిక సంస్థలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ అంశంపై కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుతం ఈ అంశం ఆర్థిఖ శాఖ పరిధిలో ఉందని, త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు. జిల్లా ఖనిజ నిధి కింద అభివృద్ధి పనులు చేసేందుకు వెసులుబాటు ఉందని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి, వికారాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ అరుణకుమారి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, మల్లారెడ్డి, వివేకానంద, మహేశ్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, రోహిత్‌రెడ్డి, ఆనంద్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వివిధ మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.

విజేతలకు సన్మానం 
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి సన్మానించారు. శాలువా, పూలమాలలతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారుల సంఘం ఆకాక్షించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు