Sakshi News home page

నీళ్లు.. నీళ్లు.. నీళ్లు..

Published Mon, Feb 22 2016 8:50 AM

rangareddy zp meeting on water problem

 జెడ్పీ సమావేశంలో తాగునీటి సరఫరాపై సుదీర్ఘచర్చ
 అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి..
 యంత్రాంగాన్ని నిలదీసిన పాలకమండలి సభ్యులు
 వాడీవేడిగా సర్వసభ్యసమావేశం
 
తాగునీటి సమస్యపై జెడ్పీ పాలకమండలి సమావేశం దద్దరిల్లింది. కరువు నేపథ్యంలో నీటి కటకటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం.. దానికి తోడు గ్రామీణనీటి సరఫరా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై పాలకమండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సహాయ ఇంజినీర్లు అందుబాటులో ఉండడం లేదంటూ మండిపడిన సభ్యులు.. కరువు నిధులపై కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టి అధికారుల తీరును ఎండగట్టారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్‌పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
సాక్షి, రంగారెడ్డి : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం వాడీవేడిగా సాగింది. ప్రధానంగా తాగునీటిపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. ఇంతటి కరువులో ఎప్పడిక ప్పుడు పరిస్థితిని సమీక్షించాలిస్థిన డీఈ అసలు జాడే లేదంటూ మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు నివారణకు నిధులు విడుదలైనప్పటికీ సమాచారం ఇవ్వక పోవడాన్ని తప్పుబట్టారు. 
 మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కనిపించే అధికారులు ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారని, కొందరు కనీసం సర్వసభ్య సమావేశాలకు సైతం రావడం లేదంటూ మంచాల ఎంపీపీ జయమ్మ సభలో వాపోయారు. ఇరిగేషన్ ఏఈ ఎక్కడంటూ ఈఈని ప్రశ్నించగా అనారోగ్య కారణాలతో ఆయన సెలవులో ఉన్నారని.. ఏఈకి బదులుగా అక్కడి వ్యవహారాలు తానే చూసుకుంటానంటూ ఈఈ భీంప్రసాద్ తెలిపారు. శంషాబాద్‌లోనూ ఇంజనీర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు సతీష్  అసహనం వ్యక్తం చేశారు.
 
 గ్రామీణాన్ని మరిచి పట్టణ ప్రాంతాలకు...
 ఆదాయం ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో కరువు నిధులను ఎక్కువగా ఖర్చు చేయడాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆక్షేపించారు. ఆదాయం తక్కువగా ఉండి.. వనరులు లేని పంచాయతీలపై దృష్టి సారించాలని, పట్టణ ప్రాంత పంచాయతీలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉన్నందున పల్లె జనానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కొత్త బోర్లు వేసేందుకు అనుమతి లేదంటూ అధికారులు చెబుతున్నారని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పెంచాలని, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతన సమస్యను పరిష్కరించాలని వికారాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు కోరారు. కృష్ణా మూడు దశల పైపులైన్లు ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లినప్పటికీ.. ఈ మూడు మండలాలకు తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని, ఇక్కడి ప్రజలకు సరిపడా నీళ్లివ్వకుంటే తిరుగుబాటు చేస్తామని మంచాల జెడ్పీటీసీ మహిపాల్ హెచ్చరించారు. ప్రైవేటు స్థలాలు, గ్రామానికి దూరంగా ఉన్న పాంతాల్లో బోర్లకు అనుమతిచ్చినా పైపులైన్లకు నిధులివ్వకుంటే ప్రయోజనం ఏంటని జెడ్పీటీసీ శైలజ ప్రశ్నించారు. తాజా ప్రణాళికలో ఈ మేరకు నిధులు అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.59కోట్లు విడుదల చేసిందని, వేసవిలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి వివరించారు.
 
 రుణాలు ఉత్తిమాటలే..
 పంటరుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం చూపుతున్నారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటూ కందుకూరు జెడ్పీటీసీ జంగారెడ్డి యంత్రాంగాన్ని నిలదీశారు. కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి పంటబీమా సైతం చెల్లించకపోవడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందిస్తూ ఇకపై రైతును యూనిట్‌గా తీసుకుంటూ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. రుణాలివ్వని బ్యాంకులపై లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. వికారాబాద్ డివిజన్లో పత్తి పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, రాష్ట్ర సంచాలకుడి వద్ద కేసు పరిశీలనలో ఉందని ఇన్‌చార్జ్ జేడీఏ జగదీష్ అన్నారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన నవాబ్‌పేట జెడ్పీటీసీ పి.రాంరెడ్డితో జెడ్పీ సీఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మంత్రి మహేందర్డ్డ్రి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డిని ఆయన అభినందించారు.

Advertisement
Advertisement