నిమిషానికో నిర్భయ..! | Sakshi
Sakshi News home page

నిమిషానికో నిర్భయ..!

Published Mon, Jul 10 2017 1:25 AM

నిమిషానికో  నిర్భయ..! - Sakshi

ఢిల్లీలో కొనసాగుతున్న అత్యాచారాల పర్వం
ఐదేళ్లలో దేశ రాజధానిలో పెరిగిన రేప్‌ కేసుల శాతం 277

గత నెల 19న 48 గంటల వ్యవధిలో ఐదు అత్యాచార కేసులునమోదయ్యాయి. దీనికి అదనంగా జూన్‌ 20న ఓ మాల్‌ వెలుపల పార్క్‌ చేసిన కారులో ఓ యువతిపై.. అదే రోజు ఢిల్లీ శివార్లలో కదులుతున్న కారులో మరో మహిళపై అత్యాచార ఘటనలు జరిగాయి.

ఢిల్లీలో నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత అనేక ఆందోళనలు చెలరేగడంతో.. ప్రభుత్వం అత్యాచారాల నిరోధానికి నిర్భయ చట్టాన్ని సైతం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇవేవీ మహిళలను కాపాడలేకపోతున్నాయి. ఇప్పటికీ దేశ రాజధానిలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉందే. అందుకు తగ్గట్టే ఢిల్లీలో నమోదవుతున్న రేప్‌ కేసుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2011లో 572 రేప్‌ కేసులు నమోదైతే.. 2016కు వచ్చే సరికి 277 శాతం పెరుగుదలతో ఆ సంఖ్య 2,155కు చేరిందని ఢిల్లీ పోలీసుల తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది.

2012 డిసెంబర్‌ 16న పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యంత కిరాతకంగా పలువురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఆ ఏడాది ఢిల్లీలో రేప్‌ కేసుల సంఖ్య 132 శాతం పెరిగింది. ఆ తర్వాత కూడా 32 శాతం పెరుగుదలతో 2013లో 1,636 కేసుల నుంచి 2016 నాటికి 2,155 కేసులకు పెరిగింది. ఇక మహిళల గౌరవానికి భంగం కలిగించాలనే ఉద్దేశంతో చేసే దాడులకు సంబంధించిన కేసుల సంఖ్య కూడా 473 శాతం పెరిగింది. 2012లో వీటికి సంబంధించి 727 కేసులు నమోదైతే.. 2016 నాటికి ఆ సంఖ్య 4,165కు పెరిగింది.

ఆగని కీచకపర్వం
2017 మొదటి ఐదు నెలల్లోనే ఢిల్లీలో 836 రేప్‌ కేసులు నమోదయ్యాయి. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో జరుగుతున్న వాస్తవ అత్యాచారాల సంఖ్యను ఇది ప్రతిబింభించడం లేదు.  నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో రికార్డుల ప్రకారం.. 2015లో ఎన్‌సీఆర్‌లో 3,430 రేప్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ఢిల్లీలో నమోదైనవే 64 శాతం(2,199 కేసులు) కావడం గమనార్హం. మరోవైపు దేశంలో రేప్‌ కేసులకు సంబంధించి శిక్షలు పడుతున్న కేసులు ఇంకా తక్కువగానే ఉన్నాయి. 2015లో 29.7 శాతం అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలు వెల్లడించాయి.

ఫలితమివ్వని ప్రభుత్వ చర్యలు
మహిళలకు భద్రత కల్పించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్‌ వెహికల్‌ సెక్యూరిటీ, ట్రాకింగ్‌ సిస్టమ్, మహిళల హెల్ప్‌లైన్‌ మొదలైనవి మహిళలపై రేప్‌ కేసులు, లైంగిక వేధింపుల కేసుల సంఖ్య తగ్గడానికి తోడ్పడటం లేదు. మరోవైపు ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో మహిళల భద్రత కోసం కేటాయించిన నిధులు వినియోగించకపోవడంతో అశ్రద్ధ వల్ల ఆ నిధులు అలాగే మూలుగుతున్నాయి.
–సాక్షి, తెలంగాణ  డెస్క్‌

Advertisement
Advertisement