రేషన్‌ డీలర్ల సమ్మె తాత్కాలికంగా విరమణ | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల సమ్మె తాత్కాలికంగా విరమణ

Published Sat, Nov 4 2017 1:38 AM

The ration dealer's strike is temporarily retirement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌ సీవీ ఆనంద్‌తో డీలర్ల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు రేషన్‌డీలర్ల సంఘం ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా రేషన్‌ దుకాణాలు మూసివేసి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో డీలర్ల ప్రతినిధి బృందాన్ని మంత్రి చర్చలకు పిలిచారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్‌కు నగదు బదిలీ యోచన విరమించాలని, డీలర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని, గౌరవ వేతనం గ్రేటర్‌లో రూ.60 వేలు, కార్పొరేషన్‌లో రూ.50 వేలు, మున్సిపాలిటీలో రూ.30 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సరుకులపై కమీషన్‌ పెంచాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, బకాయిలు విడుదల చేయాలని మంత్రిని కోరారు.

మంత్రి స్పందిస్తూ డీలర్ల సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని, బకాయిలు వెంటనే విడుదల చేస్తామని హామీనిచ్చారు. దీనిపై ఈ నెల 10న సీఎం కేసీఆర్‌తో స్పష్టమైన ప్రకటన చేయిస్తానని చెప్పారు. లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తా మని డీలర్లు పట్టుబట్టగా, డీలర్ల సమస్యలను పరిష్కరిస్తానని అసెంబ్లీలోనే ప్రకటించానని, లిఖితపూర్వకంగా అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. దీంతో సమ్మె విరమణకు డీలర్లు అంగీకరించారు. ప్రతినిధుల బృందంలో తెలంగాణ రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌రెడ్డి, కార్యదర్శి ఆనంద్, పలు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు.


సీఎం ప్రకటన లేకుంటే మళ్లీ ఆందోళన
తమ సమస్యలపై ఈ నెల 10న సీఏం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయకపోతే తిరిగి 15వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని రేషన్‌ డీలర్ల అసోసి యేషన్‌ అధ్యక్షుడు నాయి కోటి రాజు స్పష్టం చేశారు. మూడున్నరేళ్ల నుండి రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తా మని హామీ ఇస్తూ నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వానికి ఇది చివరి అవకాశమని అన్నారు. గోవాలో క్వింటాల్‌æ బియ్యా నికి రూ. 200, మహారాష్ట్ర రూ.150, గుజరాత్‌ రూ.102, జార్ఖండ్‌ రూ.100 చెల్లిస్తుండగా తెలంగాణలో రూ.20 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement