గీత దాటితే వేటే! | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటే!

Published Sat, Nov 24 2018 2:13 AM

Ravat Satisfy on the elections arrangements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా దూషణలు, కుల, మతాల పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే సంబంధిత పార్టీ అగ్రనాయకత్వంపై ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓమ్‌ ప్రకాశ్‌ రావత్‌ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాలు 100 శాతం ట్యాంపర్‌ రహితం కావని కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు జేఎం లింగ్డో, సంపత్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా, ప్రపంచంలో ఏ యంత్రాన్ని అయినా ట్యాంపర్‌ చేయవచ్చన్నారు. యంత్రాలకు కళ్లు, చెవులు, నోరు, చేతులుండకపోవడంతో అవి తమను తాము సంరక్షించుకోలేవన్నారు. అవి మనుషుల సంరక్షణలో ఉండాల్సిందేనని, వారు రాజీపడితే ట్యాంపరింగ్‌ సాధ్యమేనన్నారు. లేనిపక్షంలో ఈవీఎంలు పూర్తిగా ట్యాంపర్‌ ప్రూఫ్‌ యంత్రాలే అన్నారు. ఈవీఎంలకు ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం చేపట్టిన రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లడానికి ముందు శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి, ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ కష్టపడి పనిచేసి ఏర్పాట్లలో మంచి పురోగతి సాధించారని కొనియాడారు. 

నేర చరిత్రపై ప్రకటనలు ఇవ్వాల్సిందే.. 
పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించగా.. ఓటర్ల జాబితాలో తప్పులు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు, కుల, మతాల పేరుతో ఓట్ల అభ్యర్థన, ఫోన్ల ట్యాపింగ్, అనుమతుల జారీలో అధికారుల వివక్ష తదితర ఫిర్యాదులు, సూచనలొచ్చాయని రావత్‌ అన్నారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులు, సూచనలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని రావత్‌ అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఎలాంటి ప్రలోభాలు, భయాందోళనలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరామన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదుపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఈ–సువిధ యాప్‌ ద్వారా ప్రచార కార్యక్రమాలకు అనుమతుల జారీలో అన్ని పార్టీలకు సమ అవకాశం కల్పించాలని, 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని సూచించామన్నారు. రాజకీయ పార్టీల యాజమాన్యంలో పత్రికలు, వార్తా చానళ్లకు కూడా ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి తనపై ఉన్న నేర చరిత్రను వేర్వేరు రోజుల్లో మూడు పర్యాయాలు పత్రికలు, వార్తా చానళ్లలో ప్రకటనలు జారీ చేయాల్సిందే అన్నారు. 

నియోజకవర్గానికో మహిళా పోలింగ్‌ కేంద్రం 
ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున రాష్ట్రంలో 119 మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రావత్‌ అన్నారు. వీవీ ప్యాట్‌లో ఓటు వేరే వారికి పడినట్లు కనిపిస్తోందని పోలింగ్‌ ఏజెంట్ల నుంచి ఫిర్యాదులొస్తే.. పరిశీలన జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్‌ అధికారులకు ఉందన్నారు. పోలింగ్‌ సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. 2014లో రాష్ట్రంలో 7,056 మంది సర్వీస్‌ ఓటర్లుండగా, తాజాగా 10,038కు పెరిగారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తదుపరిగా ఇంకొన్ని చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. పెండింగ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలని, నేరస్తులను బైండోవర్‌ చేయాలని, అవసరమైతే అరెస్టు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, కానుకల పంపిణీ జరుగుతోందని ఫిర్యాదులున్నాయన్నారు. ఇప్పటి వరకు గణనీయ సంఖ్యలో రూ.77.80 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, గత ఎన్నికల్లో జప్తు చేసిన రూ.76 కోట్లతో పోల్చితే ఈ సారి పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయన్నారు.  

ఆధార్‌తో ‘ఓటర్ల’అనుసంధానంపై చర్చలు
ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లు లేవని, డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారని రావత్‌ అన్నారు. పునరావృతమైన ఓటర్లను ప్రస్తుతం తొలగించడం సాధ్యం కాదన్నారు. 2019 జనవరి 1 అర్హత తేదీ గా నిర్వహించనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా పునరావృత ఓటర్లను తొలగిస్తామని, ఈ జాబితాతో 2019లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితాను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే అంశంపై యూఐడీఏఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించే హామీ లు సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని, ఇలాంటి హామీలను మేనిఫెస్టోలో పెడితే ఎన్నికల సంఘం పరిశీలించి మార్పులకు సూచిస్తుందన్నారు. మౌఖికంగా ఇలాంటి హామీలు ఇస్తే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1952 నుంచి గులాబీ బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తున్నామని, ఇప్పుడో పార్టీ గులాబీ రంగు జెండాను కలిగి ఉందని బ్యాలెట్ల రంగు మార్చలేమన్నారు. జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించే అంశంపై పరిశీలన చేస్తామన్నారు. గతంలో తాము నిర్వహించిన పర్యటనలో జరిపిన పరిశీలనతో పోల్చితే ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లలో మంచి పురోగతి వచ్చిందని, గత పర్యటన అనంతరం కలిగిన ఆందోళన దూరమైందన్నారు. సీఈవో రజత్‌కుమార్‌ బాగా కష్టపడ్డారని అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సునీల్‌ అరోరా, సీఈవో రజత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం మొరాయిస్తే ఏం చేస్తారు?
కలెక్టర్ల పరిజ్ఞానానికి ఈసీఐ రావత్‌ పరీక్ష
పోలింగ్‌ సమయంలో ఈవీ ఎం మొరాయిస్తే ఏం చర్యలు తీసుకుంటారు? వీవీ ప్యాట్‌ పనిచేయకపోతే ఎలా స్పందిస్తారు? వంటి ప్రశ్నలతో ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లకు ఉన్న పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓమ్‌ ప్రకాశ్‌ రావత్‌ పరీక్షించి చూశారు. ఎన్నికల సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కలెక్టర్ల స్పందన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. శాసనసభ ఎన్నికల నిర్వహణకు వచ్చే 15 రోజులే కీలకమని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు  అప్రమత్తతతో పని చేయాలని ఆదేశిం చారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకుగాను రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం రెండో రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో కలసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు   పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఘట నలపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలుపుదల చేయాలన్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ జిల్లాలో డబ్బులు, మద్యం జప్తు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ.. తమ జిల్లాలోని కొడంగల్‌ నుంచి రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గంపై అధిక దృష్టి పెట్టాల్సి వస్తోందని తెలియజేసినట్లు సమాచారం.  

Advertisement

తప్పక చదవండి

Advertisement