మళ్లీ హౌజింగ్‌ బోర్డు వెంచర్లు | Sakshi
Sakshi News home page

మళ్లీ హౌజింగ్‌ బోర్డు వెంచర్లు

Published Thu, May 4 2017 3:10 AM

మళ్లీ హౌజింగ్‌ బోర్డు వెంచర్లు

రూ.వేయి కోట్లతో 13 చోట్ల ప్రాజెక్టులు
డూప్లెక్స్, ఇండిపెండెంట్, ఫ్లాట్స్‌ నమూనాలో ఇళ్ల నిర్మాణం
త్వరలో ధరల ఖరారు... పక్షం రోజుల్లో నోటిఫికేషన్‌  


సాక్షి, హైదరాబాద్‌: మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణంలో చేయితిరిగిన గృహనిర్మాణ మండలి కొన్నేళ్ల తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్టులతో తెరపైకి వస్తోంది. గత ఐదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆ మండలి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి డిమాండ్‌ నోటిఫికేషన్‌లు జారీ చేయబోతోంది. రూ.వేయి కోట్లతో రాష్ట్రంలోని 13 ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టబోతోంది. డూప్లెక్స్‌ నమూనా, ఇండిపెండెంట్‌ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించబోతోంది. మరో పక్షం రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది.

 ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు జారీ చేయకపోవటంతోపాటు, గతంలో డిమాండ్‌ సర్వే చేసిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గృహనిర్మాణ సంస్థను ప్రభుత్వం రద్దు చేయటంతో గృహనిర్మాణ మండలిపై కూడా నీలినీడలు ఏర్పడ్డాయి. స్వగృహ కార్పొరేషన్‌ దాదాపు మూతపడ్డ నేపథ్యంలో గృహనిర్మాణ మండలి కథ కూడా కంచికి చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎట్టకేలకు మళ్లీ కొత్త నోటిఫికేషన్లతో హౌసింగ్‌ బోర్డు మనుగడ చాటుకునేందుకు రెడీ అయింది. సాధారణంగా బోర్డు నోటిఫికేషన్లకు మంచి స్పందన ఉంటుంది. నిర్మించబోయే ఇళ్ల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి.

ఇప్పటికీ మంచి డిమాండ్‌ ఉండటంతో కొత్త నోటిఫికేషన్లకు కూడా దరఖాస్తులు పోటెత్తుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇళ్ల ధరలను మరికొద్ది రోజుల్లో నిర్ధారించి పక్షం రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం. నగరంలోని కూకట్‌పల్లి, చందానగర్,  శివార్లలోని పోచారం, తట్టిఅన్నారం, బాచుపల్లి, మంగళ్‌పల్లి, గచ్చిబౌలి, బౌరంపేటలాంటి మంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలతోపాటు నల్లగొండ, సదాశివపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ తదితర 13 చోట్ల ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు.

Advertisement
Advertisement