పరిషత్ పోరు షురూ! | Sakshi
Sakshi News home page

పరిషత్ పోరు షురూ!

Published Mon, Mar 17 2014 3:49 AM

పరిషత్ పోరు షురూ!

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ :
 జిల్లాలోని 817 ఎంపీటీసీలు, 57 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలో ఒకరోజు, కరీంనగర్, సిరిసిల్ల డివిజన్లలో మరో రోజు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 57 జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
 
 దీనికోసం జెడ్పీలో ఐదు ప్రత్యేక కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఎంపీటీసీ నామినేషన్లు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో వేయా ల్సి ఉంటుంది. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బ్యాలెట్ పద్ధతిన పార్టీ ప్రాతిపాదికనే ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటు స్థానిక ఎన్నికల్లో ఉండదు.
 
 ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు అధికారులు విడుదల చేశారు. జెడ్పీ ఎన్నికల్లో 27 లక్షల 40 వేల 666 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో 15 వేల సిబ్బంది పాలుపంచుకోనున్నారు. రీపోలింగ్, కౌంటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
 
 
 ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
 జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదివారం పరిశీలించారు. అభ్యర్థులు లోపలికి ఒక ద్వారం నుంచి వచ్చి మరో ద్వారం గుండా బయటకు వెళ్లేలా వే ర్వేరు ద్వారాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బారీకేడ్లు ఏర్పాట్లు చేయాలని అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించాలని చెప్పారు. మైక్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.
 
 సహకరించాలి
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ వివరించారు. పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు.
 
  సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ సీఈవో వి.సదానందం, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, డెప్యూటీ సీఈవో సత్యవతి, డీపీవో కుమారస్వామి, డెప్యూటి సీఈవో సత్యవతి, డీఎస్పీ రవీందర్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఎం.స్వామినాథాచార్యులు, కొరివి వేణుగోపాల్, వాసాల రమేశ్, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, భీమాసాహెబ్ పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement