కుచ్చుటోపి..! | Sakshi
Sakshi News home page

కుచ్చుటోపి..!

Published Thu, Aug 13 2015 4:35 AM

కుచ్చుటోపి..!

ఎవరికైనా ఇంటి స్థలం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది... కానీ ఏ పూటకు ఆ పూట శ్రమించే వారికి అది తీరని కోరిక... ఖర్చు తగ్గించుకోనైనా సరే నెలకు కొంత చెల్లించే పద్ధతి ఉంటే వారికి సులువు. ఐదేళ్లయినా ఇంటిస్థలం చేతికొస్తుందంటే కాయ కష్టం చేసైనా సరే... ఓ ప్లాటు దక్కించుకోవాలని ఉంటుంది. సరిగ్గా ఇలాంటి జనం ఆశలను సొమ్ము చేసుకునేందుకు అప్పట్లో ఎం దరో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఆటోడ్రైవర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, దినసరి కూలీలు.. ఇలా సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొనేందుకు వచ్చి ఈ ‘రియల్’ వ్యాపారుల ఉచ్చులో పడ్డారు.

నిజామాబాద్ నగరంలో 2008లో రియల్టర్లు ఓ దేవుడి పేరిట సంస్థను నెలకొల్పారు. 2031 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. వారి వద్ద నెలకు రూ.375 చొప్పున వసూలు చేసి.. మొహం చాటేశారు. ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ప్లాట్లు చూపడం లేదు. ఏడాది క్రితం తమకు ప్లాట్లు కావాలని బాధితులు గొడవ చేయడంతో నిజామాబాద్ బైపాస్‌రోడ్డును అనుకుని దుబ్బ సమీపంలో ఉన్న భూమిని చూపిన సంస్థ నిర్వాహకులు.. ఆ తర్వాత అందులో అసైన్డ్ భూమి ఉందని దాటవేశారు.

ఇప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు. సుమారు రూ.2.50 కోట్లకు పైగా సాగిన వసూళ్ల పర్వంలో జిల్లా రైసుమిలర్ల సంక్షేమ సంఘం నేత ఒకరు కీలకంగా వ్యవహరించగా.. బాధితులంతా కొత్త కలెక్టర్ యోగితా రాణాను కలిసేందుకు సిద్ధమవుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

 ప్లాట్ల పేరిట స్కీం, మోసం
  నిజామాబాద్ రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘానికి చెందిన ఓ ముఖ్యనాయకుడు, మరో నలుగురు కలిసి 2008లో ‘అతి తక్కువ ధరకే ప్లాట్ల విక్రయాలు’ అన్న నినాదానికి తెర లేపారు. దుబ్బలోని బైపాస్‌రోడ్డు పక్కన నాలుగు ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయానికి పెట్టారు. ందుకోసం ప్రత్యేక స్కీం ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ. 375 చెల్లించాలని నిర్ణయించారు. నగరంలోని కొందరు, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వారు ఈ స్కీంలో చేర్పించారు. సుమారు వెయ్యి మంది ప్రతి నెలా  రూ.375 రూపాయలు చెల్లిస్తూ వస్తున్నారు. 2008 నుంచి నేటి వరకూ ఈ చెల్లింపులు కొనసాగుతున్నారుు. తీరా ప్లాట్ల విషయానికి వచ్చే సరికి ఈ సంస్థ నిర్వాహకులు చేతులెత్తేశారు.

 ఈ భూమిలో అసైన్‌మెంట్ ల్యాండ్ ఉందని.. సెటిల్‌మెంట్ అయిన తరువాత ప్లాట్లు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లాట్లు కావాలని బాధితులు మొరపెట్టుకోగా.. తమకేమి తెలియదంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. దుబ్బకు చెందిన ఓ వ్యక్తి తమకు న్యాయం చేయాలంటూ గతంలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.  సుమారు ఏడు సంవత్సరాల నుంచి సామాన్యుల వద్ద రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ప్లాట్లు ఇవ్వమని బాధితులు అడిగితే మొన్నటివరకు అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసిన రియల్టర్లు.. తాజాగా తమకేమి తెలియదని చెప్పుకొస్తున్నారు. ఈ స్కీంలో ముఖ్యనాయకుడైన సదరు రైస్‌మిల్ అసోసియేషన్ నాయకుడు మాత్రం తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
 
 ఒక్కటవుతున్న బాధితులు..
 ప్లాట్ల విక్రయాల పేరిట సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించి నెలనెలా వాయిదాల పద్ధతిలో కొనసాగిన వసూళ్ల పర్వంపై బాధితులు ఏకమవుతున్నారు. నందిపేట, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి, నిజామాబాద్ నగరం, నగర శివారు గ్రామాలకు చెందిన పలువురు 14 తర్వాత కొత్త కలెక్టర్ యోగితారాణాను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు రెండు రోజుల క్రితం బాధితులు నిజామాబాద్‌లో సమావేశమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకులు కొందరిని పిలిచి మాట్లాడినట్లు చెప్తుండగా.. మరికొందరికీ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సుమారు ఏడేళ్ల కిందట మొదలైన ఈ ఘరానా మోసం ఇంకా కొనసాగుతున్నా.. బాధితులకు మాత్రం ప్లాట్లు, పట్టాలు ఇవ్వడం లేదు. అత్యధికంగా ఆటోడ్రైవర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, దినసరి కూలీలు తదితర అమాయకులైన ప్రజల నుంచి జిల్లా కేంద్రంలో ప్లాట్ల విక్రయాల పేరిట ప్రతినెలా డబ్బులు వసూలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement