కౌంట్‌డౌన్‌ షురూ... | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ షురూ...

Published Tue, Nov 27 2018 4:46 PM

Remaining Nine Days For Election Campaign - Sakshi

సాక్షి, పెద్దపల్లి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమీపించిన తరుణంలో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రచార పర్వానికి కేవలం మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు రెట్టింపు చమటోడ్చుతూ ముందుకు సాగుతున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రచారాన్ని కొనసాగిస్తూ.. ప్రచారానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.


అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పోలింగ్‌ వచ్చేనెల 7న ఉండగా, 48 గంటల ముందుగానే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. అంటే వచ్చేనెల 5 సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు పూర్తవుతుంది. ఈ లెక్కన కేవలం మరో తొమ్మిది రోజులు మాత్రమే అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ తొమ్మిది రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రచారం ఒకెత్తు అయితే.. ఇకముందు చేయబోయే ప్రచారం కీలకం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు చమటోడ్చుతున్నారు. దాదాపు అభ్యర్థులంతా మార్నింగ్‌వాక్‌నూ వదిలిపెట్టకుండా తెల్లవారుజాము నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణాల్లో రాత్రివేళల్లోనూ సభలు నిర్వహిస్తున్నారు. కుల సంఘనేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో అర్ధరాత్రి వరకు మంతనాలు జరుపుతున్నారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. 


చేరికలపై నజర్‌..
ఎన్నికలు సమీపించడంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో కీలక నేతలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. పోలింగ్‌కు ముందు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే లాభం ఉంటుండడంతో వారికి గాలం వేస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ కొంతమంది నాయకులు దీనికోసం ప్రత్యేకంగా పనిచేస్తుండడం గమనార్హం. ఊళ్లో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులెవరు...వారి ప్రభావమెంత.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు.. ఏంచేస్తే మన పార్టీలోకి వస్తారంటూ.. వాళ్లంతా వ్యూహరచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అభ్యర్థులతో మాట్లాడించి, పార్టీలో చేర్చుకుంటున్నారు. సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ చైర్మన్లు, కులసంఘాల పెద్దలకు అన్నిపార్టీలు గాలం వేస్తున్నాయి. పార్టీలో చేరికల ద్వారా ఆయా గ్రామాలు, పట్టణాల్లో తమ బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.


చివరన బహిరంగసభలు...
ఎన్నికల ప్రచారంలో ఊపునిచ్చే బహిరంగసభలు ప్రచారం చివర్లో ఉండేలా అన్ని పార్టీలు వ్యూహరచన చేశాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల షెడ్యూల్‌లు ఇందుకు అనుగుణంగా మార్చుకున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో ఆయా పార్టీల అధినేతలు, స్టార్‌కంపెయినర్‌లు జిల్లాకు రానున్నారు. అధినేతల సభలు భారీగా నిర్వహించడం ద్వారా ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ప్రచారానికి కేవలం తొమ్మిది రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.  

మరిన్ని వార్తలు...

Advertisement
Advertisement