ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం రావాలి | Sakshi
Sakshi News home page

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం రావాలి

Published Mon, Jul 7 2014 4:28 AM

Reservations in the private sector to take the law

సాక్షి,సిటీబ్యూరో: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావాలని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ (ఏఐసీఎస్‌వో) నేషనల్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఉదిత్‌రాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆల్  ఇండి యా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్ -2014 నిర్వహించారు.

ప్రైవేట్ రంగం, పదోన్నతులు, కార్పొరేట్ విద్యా సంస్థలు, డీలర్ షిప్, కాంట్రాక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో రిజర్వేషన్లు అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలల్లో అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని ప్రైవేట్ రంగంలోనూ అమలు చేయాలన్నారు. ఇందుకు అందరం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నా రు.

యువజన సంఘాలను ఉద్యమంలో భాగస్వాములు చేయాలన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దళితులను ఏకం చేయాల్సి ఉందన్నారు. విశ్రాంత చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు మాట్లాడుతూ ప్రమోషన్లలో రిజర్వేషన్‌కు సంబంధించి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలన్నారు. గురుకుల విద్యాలయ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేయడం కాదని, గ్రామాల్లోకి వె ళ్లి పనిచేయాలన్నారు.

సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోలాగా జాతీయ స్థాయిలో సబ్‌ప్లాన్‌ను జాతీయ స్థాయిలో చట్టంగా తేవాలన్నారు. ఆల్ ఇండియా క్రిష్టియన్ కౌన్సిల్ చైర్మన్ మాట్లాడుతూ జోషఫ్ డిసౌజా మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌కంట్యాక్స్ కమిషనర్ డాక్టర్ యు. దేవి ప్రసాద్, అడిషనల్ కమిషనర్ ఎం దయా సాగర్, ప్రముఖ కవి గోరటి వెంకన్న, కుల వివక్షపోరాట సమితి నేత జి. రాములు, ఓయూ లా కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, ప్రజా కవి గద్దర్ తదితరులు పాల్గొన్నారు.
 
కేసీఆర్ మాట తప్పారు : ఎంపీ ఉదిత్‌రాజ్
 
తెలంగాణ రాష్ట్రానికి దళితున్ని తొలి సీఎం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖరరావు మాట ఇచ్చి తర్వాత తప్పారని ఎంపీ డాక్టర్ ఉదిత్‌రాజ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర కీలకమైందన్నారు. దళితులను కేసీఆర్ విస్మరిస్తే దళితులకు ద్రోహం చేసినట్లేనని చెప్పారు.
 

Advertisement
Advertisement