Sakshi News home page

చెరువుల పునరుద్ధరణకు రూ. వెయ్యి కోట్లు

Published Mon, Nov 3 2014 1:29 AM

చెరువుల పునరుద్ధరణకు రూ. వెయ్యి కోట్లు

కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న రాష్ర్టం
* ఈ నెల మూడోవారంలో చెరువు పనుల అంచనాలు పూర్తి, టెండర్ల నిర్వహణ
* డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం.. మే చివరకు ముగింపు
* జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు

మరమ్మతు, నిర్వహణ, పునరుద్ధరణ (ఆర్‌ఆర్‌ఆర్) పథకం కింద రూ.వెయ్యి కోట్లతో చెరువుల పునరుద్ధరణకు అత్యవసరంగా అంచనాలు తయారు చేసి కేంద్రానికి పంపాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను అదేశించారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై ఆదివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈలు, ఈఈలతో ఆయన వీడియో కాన్ఫరెన్‌‌స నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణలో పాటించాల్సిన మార్గదర్శకాలను అధికారులకు వివరించామన్నారు.

రూ.5 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 9 వేల చెరువుల పునరుద్ధరణను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే చివరి నాటికి పూర్తిచేయాలని అధికారులకు గడువు విధించినట్టు చెప్పారు. నవంబర్ మూడోవారంలోగా అంచనాలను రూపొందించి ఆ వెంటనే టెండర్లు నిర్వహించాలని ఆదేశించామన్నారు. నామినేషన్ల పద్ధతిపై చెరువుల పనులను అప్పగించే విధానానికి స్వస్తి పలికి ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో చేపట్టాలని స్పష్టంగా పేర్కొన్నామన్నారు. చెరువుల పునరుద్ధరణ నిర్వహణ కోసం ఇంజనీర్లకు విస్తృత అధికారాలు అప్పగించామని, టెండర్ల నిర్వహణ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల సీలింగ్‌ను పెంచినట్టు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రూ.50 లక్షల లోపు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు రూ.కోటి లోపు, చీఫ్ ఇంజనీర్లు రూ.4 కోట్ల లోపు అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించేలా అధికారాలను విస్తృతం చేశామన్నారు.
 
చెరువుల నుంచి తొలగించిన పూడిక మట్టిని తమ పంట పొలాల్లో వేసుకోడానికి ఏ గ్రామ రైతులు ముందుకు వస్తారో ఆ గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తక్షణమే పనులు చేపట్టేందుకు వీలున్న చెరువుల పనులు ముందుగా చేపట్టనున్నట్టు చెప్పారు. పనుల పర్యవేక్షణ కోసం జిల్లాకు ఒక ఎస్‌ఈ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఈ, ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు డీఈఈలు, ప్రతి మండలానికి ఒక ఏఈని నియమిస్తామన్నారు. ఇంజనీర్ల కొరతను తీర్చడానికి వంద మంది రిటైర్డు ఇంజనీర్ల సేవలు వినియోగించుకునేందుకు అనుమతించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తామన్నారు.
 
విద్యుదుత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు
అచ్చంపేట: ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని అడ్డుపెట్టుకొని కరెంట్ విషయంలో తెలంగాణ ను ఇబ్బందులు పెడుతూ విషం చిమ్ముతున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం పెని మిళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో చేసుకున్న ఉమ్మడి ఒప్పం దాలను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పోకల మనోహర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యు లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Advertisement
Advertisement